ఖర్మ కాలితే తప్ప చోక్సీ వచ్చేది అనుమానమే

మనదేశంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన మొహూల్ చోక్సీ వ్యవహారం చాలా అనుమానాస్పదంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుండి రు. 13500 కోట్లు దోచుకున్న చోక్సీ మూడేళ్ళ క్రితం విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఆయన ఆచూకి కూడా తెలీలేదు. అయితే చివరకు ఆంటీగ్వా దీవుల్లో ఉన్నాడని కనుక్కున్నారు. అక్కడి నుండి మనదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

కేంద్రం ఇలా ప్రయత్నాలు మొదలుపెట్టిందో లేదో వెంటనే చోక్సీ ఆంటీగ్వా నుండి డొమినికాకు పారిపోయాడు. తనను కిడ్నాప్ చేసి డొమినికాకు ఎత్తుకెళ్ళిపోయారని చోక్సీ వాదిస్తున్నాడు. అయితే డొమినికా పోలీసులు మాత్రం అక్రమంగా, ఉద్దేశ్యపూర్వకంగానే తమ దేశంలోకి చొరబడ్డాడని వాదిస్తున్నారు. ఇదే విషయమై చోక్సీపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇక్కడే చోక్సీ వ్యవహారశైలిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంట భారత్ కు రావటం ఇష్టంలేని చోక్సీనే ఉద్దేశ్యపూర్వకంగా ఏదో తప్పు చేయటం కొంతకాలం పాటు అదే దేశంలో ఉండేందుకు ప్రయత్నించటం ఆర్ధిక నేరగాళ్ళకు అలవాటే. ఇప్పటికే లండన్ కు పారిపోయిన విజయామాల్య, నీరవ్ మోడి ఇదే పద్దతిలో భారత్ రాకుండా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తాముంటున్న దేశాల్లోనే ఏదో ఓ నేరమో లేకపోతే తప్పు చేయటమో చేస్తారు. దాంతో అక్కడి చట్టాల ప్రకారం వాళ్ళపై విచారణ మొదలవుతుంది. ఆ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలీదు.

ఇక్కడ చోక్సీ బ్రదర్స్ కూడా డొమినికాలోనే ఉండేందుకు ఉన్నతస్ధాయి వ్యక్తులకు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెప్పారనే ఆరోపణలు వినబడతున్నాయి. ఆరోపణలు నిజమే అయితే చోక్సీని భారత్ కు అప్పగించే కార్యక్రమం ఇప్పట్లో పూర్తికాదు. ఎందుకంటే అక్కడి కోర్టుల్లో విచారణ తేదీలు మారుతుంటాయే కానీ ఎప్పటికీ పూర్తికాదు. విచిత్రమేమిటంటే చోక్సీ భారత్ లో ఉన్నపుడే విదేశాల్లో తనకు అనుకూలంగా అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడట. కాబట్టి చోక్సీ ఖర్మ కాలితే తప్ప మామూలుగా అయితే మనదేశానికి ఇప్పట్లో వచ్చేది అనుమానమనే చెప్పాలి.