మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమని ఇప్పటికే అందరికీ అర్థమయ్యింది. వరసగా ఈటల ఢిల్లీలోని బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. ఈపాటికి ఆయన ఢిల్లీలోనే కషాయ కండువా కప్పుకున్నట్లు వార్తలు రావాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో ఈటల కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
బీజేపీలో చేరడం ఖాయం. అయితే.. ఎప్పుడు చేరాలనే విషయమై మరి కొద్ది రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారట. అందుకే.. పార్టీ కండువా కప్పుకోకుండానే.. ఆయన హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు.
ఒక వారం రోజుల తర్వాత ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని బండి సంజయ్ ప్రకటించడం గమనార్హం. ఈ ఆలస్యానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడు బీజేపీలో చేరితో.. ఈటల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలంటూ టీఆర్ఎస్ నుంచి ఒత్తిడి ఎదుర్కునే అవకాశం ఉంది.
సరే అని ధైర్యం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే .. కొద్దిరోజుల్లో ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ను ఎదుర్కొని నిలబడటం సాధ్యపడుతుందా…? అన్న అనుమానాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఈటలకే వదిలేయటంతో… ఆయన సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈటల తనతో పాటు కేవలం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని మాత్రమే తీసుకొని పోయారు. కానీ ఇంకా టీఆర్ఎస్ నుండి తనతో వచ్చే వారితో బీజేపీలో చేరికపై చర్చించలేదు. దీంతో ఈ వారం రోజుల్లో తనతో కలిసి వచ్చే వారిని తీసుకొని ఈటల బీజేపీ గూటికి చేరతారని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates