తమిళనాడు రాజకీయాల్లోకి తొందరలోనే శశికళ అలియాస్ చిన్నమ్మ రీఎంట్రీ ఉండబోతోందట. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు బెంగుళూరు జైల్లో శిక్ష అనుభివించిన చిన్నమ్మ ఎన్నికలకు ముందు తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెను దురదృష్టం వెన్నాడటంతో ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాల్సొచ్చింది. దాంతో దివంగత ముఖ్యమంత్రి నెచ్చెలిగా పాపులరైన శశికళ ప్రమేయం లేకుండానే ఎన్నికలు పూర్తయిపోయాయి.
డీఎంకే కూటమి సాధించిన ఘన విజయంతో ఎంకే స్టాలిన్ సీఎం అయ్యారు. అయితే అందరు అనుకున్నట్లు ఏఐఏడీఎంకే కూటమి సీట్ల వేటలో మరీ వెనకబడిపోలేదు. 74 సీట్లలో గెలిచి గట్టి ప్రతిపక్షంగానే నిలబడింది. అయితే ప్రధానప్రతిపక్షంలోని ఇద్దరు కీలక నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఎన్నికలైన తర్వాత విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏఐఏడీఎంకే పగ్గాలు అందుకోవటానికి చిన్నమ్మ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకనే పార్టీలోని కొందరు ముఖ్యనేతలు, ఎంఎల్ఏలతో శశికళ టచ్ లో ఉన్నారట. శశికళకు మూడు అంశాలు అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మొదటిది పార్టీ ప్రతిపక్షంలో ఉండటం. రెండోది పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు జనాకర్షణ లేకపోవటం.
ఇక మూడోది ఏమిటంటే జైలు జీవితం గడిపిన చిన్నమ్మ ఆరేళ్ళు పోటీచేసేందుకు లేదు. ఐదేళ్ళు ఎలాగూ ప్రతిపక్షంలో సరిపోతుంది. మహాఉంటే మరో ఏడాది ఓపికిపడితే సీఎం కుర్చీలో మళ్ళీ తానే కూర్చునే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారట. అంటే వచ్చే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తేనే లేండి. ఇలాంటి విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే శశికళ తొందరలోనే రంగంలోకి దూకబోతున్నట్లు ప్రచారం పెరుగుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.