థర్టీ ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ వెక్కిరిస్తోంది బాబు


రాజకీయ నాయకుడి ఏం ఉన్నా లేకున్నా.. ఎప్పుడేం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదన్న విషయం మీద మాత్రం అవగాహన ఉండాలి. ఎప్పుడు ఎవరి భుజం మీద చేయి వేయాలి? ఎప్పుడు ఎవరి మీద నుంచి భుజం తీసేయాలన్న అంశంపై క్లారిటీ ఉండాలి. ఒకవేళ.. ఇలాంటి విషయాలకు లైవ్ ఎంగ్జాఫుల్ కావాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించినోళ్లు ఉండరు. తెలివిగా స్నేహ హస్తం చాచటం.. అంతే తెలివిగా చేతిని వెనక్కి తీసేసుకోవటంలో ఆయనకు మించినోళ్లు ఉండరు. అదేం సిత్రమో.. దేశంలో తనకు మించిన రాజకీయ సీనియర్ లేదంటూ చెప్పుకునే చంద్రబాబు.. ఈ విషయంలో మాత్రం తరచూ తప్పులో కాలేస్తుంటారు.


వరుస ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదంటారు. ఆయన మాటల్లో కమిట్ మెంట్.. ఎమోషన్ అన్నవి తరచూ వినిపించినా.. అవేమీ సహజసిద్ధంగా ఉండకపోవటం పెద్ద లోపమన్న విశ్లేషణ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అటు ప్రజలకు.. ఇటు పార్టీ వారికి.. అటు రాజకీయ మిత్రులకు ఎవరికి కూడా నమ్మకస్తుడిగా కనిపించకపోవటం ఎందుకన్న విషయం మీద ఆయన ఫోకస్ పెడితే మంచిదేమో?


తాజాగా నిర్వహించిన మహానాడునే చూస్తే.. తాను పవర్ లో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్న మాటతో పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ సంతోషానికి గురైంది లేదు. అధినేత తన తప్పును తెలుసుకున్నారని ఫీల్ అయ్యింది లేదు. ఎందుకంటే.. ఈ తరహా మాటలు పవర్ పోయినప్పుడు మాట్లాడటం.. పవర్ ఉన్నప్పుడు తనకు మించినోళ్లు మరొకరు ఉండరన్న ధీమాను వ్యక్తం చేయటం బాబుకు అలవాటేనన్న మాట వినిపిస్తూ ఉంటుంది. సరే.. పార్టీ నేతల్ని సంతృప్తి పర్చలేకపోయిన చంద్రబాబు ఏపీ ప్రజలకైనా సరే సందేశాన్ని ఇచ్చారా? అంటే అదీ లేదనే చెప్పాలి.


ప్రజల కోసం కష్టపడ్డానని చెప్పి.. పార్టీని పట్టించుకోలేదని చెప్పటం ద్వారా.. అంతలా పట్టించుకుంటే మా బతుకులు ఎందుకు మారలేదో? అన్న నొసల్ని విరవటం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఏం అనుకున్నారో.. ఎలాంటి అంచనాలు వేసుకున్నారో.. ఎవరి ఫీడ్ బ్యాక్ ను నమ్మారో కానీ.. మోడీ ప్రభ తగ్గిపోతుందని.. ఆయన ఓడిపోవటం ఖాయమన్న మాటను నమ్మి మోడీ మీద యుద్ధానికి సై అన్నారు.


మొదట్నించి మోడీకి చంద్రబాబు అంటే ఒకలాంటి ఆగ్రహం.. అంతకు మించి ఆయనపై సదభిప్రాయం లేదని చెబుతారు. 2014 ఎన్నికల వేళ.. పార్టీకి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అద్వానీ.. వెంకయ్యల మాటల్ని కాదనలేక బాబును కలుపుకోవటం బహిరంగ రహస్యం. కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో బాబు గెలిచినంతనే..తన రాష్ట్రాన్ని తాను చూసుకోవటం మానేసి.. కేంద్రంలో చక్రం తిప్పుతానని ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాటకే మోడీ అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతారు. 2019 ఎన్నికల్లో తన విజయం మీద ఉన్న ధీమాతో మోడీని కాదని కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకొని చెలరేగిపోయిన ఆయనకు.. దారుణ పరాభవం ఎదురైంది. గడిచిన రెండేళ్లలో బీజేపీతో టీడీపీ దగ్గరైంది లేదు. ఆ మాటకు వస్తే మరింత దూరమయ్యారనే చెప్పాలి.


బీజేపీ బలాన్ని తాను తక్కువగా అంచనా వేసి.. దెబ్బ తిన్నాన్న భావన బాబులో ఉంది. అయితే.. ఆయన ప్యాచప్ లకు ఏపీ బీజేపీనేతలు ఎవరూ సానుకూలంగా స్పందించటం లేదన్న విషయాన్ని ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంతమందికి అర్థమైన విషయంలో చంద్రబాబుకు ఎందుకు అర్థం కాలేదన్నది పెద్ద ప్రశ్న. 2014లో మోడీ ప్రభ వెలిగిపోతున్న వేళ.. తగ్గుతుందని అంచనా వేసిన బాబు.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


ఇలాంటివేళ బీజేపీతో కలవాలన్న ఆలోచనకు మించిన తప్పు మరొకటి ఉండదు. తిరుగులేని అధిక్యతను సొంతం చేసుకున్నయూపీలోనే బీజేపీ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇదే విషయం ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనం. ఇలాంటి వేళ.. తొందరపాటుకు గురి కాకుండా.. జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటించాలి. అందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరించటం బాబు స్థాయికి తగదన్న మాట వినిపిస్తోంది. థర్టీ ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ పెట్టుకొని ఎప్పుడేం మాట్లాడాలో ఇప్పటికి తెలీకపోవటం ఏమిటి చంద్రబాబు? ఇంతకు మించిన నామర్దా ఇంకేం ఉంటుంది చెప్పండి?