రేవంత్ ఆశలపై నీళ్ళు చల్లినట్లేనా ?

రేవంత్ రెడ్డి ఆశలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీళ్ళు చల్లినట్లే అనిపిస్తోంది. ఎలాగైనా తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటికి (టీపీసీసీ)కి అధ్యక్షుడు కావాలన్నది రేవంత్ టార్గెట్. దానికి తగ్గట్లుగానే పార్టీలో చేరకముందు నుండే పావులు కదుపుతున్నారు. అయితే అధిష్టానం నుండి వచ్చిన హామీతో పార్టీలో చేరారు. ముందు ప్రచార కమిటికి ఛైర్మన్ అయ్యారు. వెంటనే టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు.

నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్ధానంలోనే ప్రెసిడెంట్ అవ్వాల్సింది. అయితే తెలుసుగా కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులున్నాయో. రేవంత్ కు ప్రెసిడెంట్ కిరీటం అనగానే చాలా గ్రూపులు ఏకమై వ్యతిరేకించాయి. దాంతో పెద్ద కథే నడిచి చివరకు వేరేదారిలేక రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టింది అధిష్టానం.

గడచిన ఆరుమాసాలుగా పార్టీ ప్రెసిడెంట్ గా ప్రకటించటానికి అధిష్టానం ప్రయత్నించటం, నేతలు వాయిదా వేయించటంతోనే సమయం గడచిపోతోంది. చివరకు నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత ప్రెసిడెంట్ ను ప్రకటించమని జానారెడ్డి చేసిన విజ్ఞప్తికి అధిష్టానం సానుకూలంగా స్పందించటంతో ప్రకటన కాస్త ఆగిపోయింది. ఈరోజో రేపే రేవంత్ ను ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా ఓటుకునోటు కేసులో ఎన్పోర్స్ మెంటు డైరెక్టరేట్ దాఖలు చేసింది.

ఈ చార్జిషీటులో రేవంత్ పై తీవ్రమైన అభియోగాలు చేసింది. మొత్తం కుట్రలో రేవంతే ప్రధాన భాగస్వామిగా చార్జిషీటులో ఈడీ చెప్పింది. దాంతో ఈ కేసులో రేవంత్ అరెస్టు తప్పేట్లు లేదు. ఇప్పటికే అరెస్టయిన రేవంత్ బెయిల్ పై బయట తిరుగుతున్నారు. చార్జిషీటు దాఖలు చేసిన నేపధ్యంలో బెయిల్ రద్దు చేసినా చేయచ్చు. ఇలాంటి సమయంలో ఇక రేవంత్ కు పీసీసీ పగ్గాలు దక్కటం ఇప్పట్లో అసాధ్యమని అర్దమవుతోంది. కేసులో నుండి బయటపడితే అప్పుడు సంగతి అప్పుడు చూడాల్సిందే.