అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఐతే ఏమీ తేలకుండానే కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది.
కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. లాక్డౌన్ కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని, అలాగే సీబీఐ నుంచి ఇంకా సూచనలు కూడా రాలేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఐతే నిజంగా కౌంటర్ సిద్ధంగా ఉంటే లాక్ డౌన్‌తో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని.. మెయిల్ ద్వారా కూడా సమర్పించవచ్చని.. ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు విషయంలో జాప్యం చేస్తూ రఘురామ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వెంకటేశ్ అన్నారు. కౌంటర్ దాఖలుకు మరోసారి గడువు ఇవ్వొద్దని.. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసు్తున్నందుకు జరిమానా విధించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. సీబీఐ ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు.
కాగా ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐలకు చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఆ రోజున కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా బెయిల్ రద్దు కేసులో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతోందని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామ పిటిషన్ వేయడం.. ఈ కేసు విచారణలో ఉండగా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారంటూ రఘురామ మీద ఏపీ సీఐడీ పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సంచనలం రేపిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates