మాజీ మంత్రి భ‌య‌ప‌డుతున్నారా… !

ఆయ‌న మాజీ మంత్రి. అధికారంలో ఉన్న‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా త‌న హ‌వా చ‌లాయించారు. త‌న కుటుంబం మొత్తం కూడా భారీ ఎత్తున నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు కూడా వచ్చాయి. ఇక‌, పార్టీలోనూ, త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనూ.. మంచి పేరే సంపాదించుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. ఆయ‌న ఫోన్‌కు ఎవ‌రైనా అన్ నోన్ నెంబ‌ర్ నుంచి చేశారంటే.. మ‌రింత‌గా ఒణికి పోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఇదే విష‌యం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ప్ర‌త్తిపాటి పుల్లారావు.. చంద్ర‌బాబు హ‌యాంలో వ్య‌వ‌సాయ‌, పౌర సంబంధాల శాఖ‌ల మంత్రిగా చక్రం తిప్పారు. ద‌శాబ్ద కాలంగా జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. పుల్లారావు అంటే చంద్ర‌బాబుకు ఎంతో న‌మ్మ‌కం అందుకే మ‌హామ‌హులు ఉన్న జిల్లాలో వారిని కాద‌ని పుల్లారావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఆయ‌న మంత్రి ప‌ద‌విని ఐదేళ్ల పాటు కంటిన్యూ చేశారు. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న కుటుంబ స‌భ్యులు సైతం జిల్లాలో రాజ‌కీయంగా చ‌క్రం తిప్పార‌నే పేరు ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో త‌న శిష్యురాలు రాజ‌కీయాల‌కు పూర్తిగా కొత్త అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ చేతిలో ఓడిపోయిన పుల్లారావు.. కొన్ని రోజులు దూకుడుగానే వున్నారు. కానీ, త‌ర్వాత కాలంలో మాత్రం పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. వాస్తవానికి గుంటూరు జిల్లాలో ఉన్న టీడీపీ నేత‌ల్లో కొంద‌రు సైలెంట్ అయినా య‌ర‌ప‌తినేని, జీవి, ఆల‌పాటి రాజా లాంటి నేత‌లు ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నారు. సైలెంట్ అయిన వారి లిస్టులో మాజీ మంత్రి పుల్లారావు ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. త‌న ఫోన్‌కు ఎవ‌రి నుంచైనా ఫోన్ వ‌స్తే.. ఒక‌టికి రెండు సార్లు స‌రిచూసుకున్నాకే.. ఆయ‌న ఫోన్ లిఫ్ట్ చేస్తున్నార‌ట‌. లేక‌పోతే.. మాత్రం ఇంట్లో నే ఉన్నప్ప‌టికీ బ‌య‌ట ఉన్నార‌ని స‌మాచారం అందిస్తున్నార‌ట‌.

ఇంకా చెప్పాలంటే ఆయ‌న ఏపీకి… త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన చిల‌క‌లూరిపేట‌కు వచ్చేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని.. ఆయ‌న ఎక్కువుగా హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేస్తున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు ముంద వ‌ర‌కు అస‌లు నియోజ‌క‌వ‌ర్గాన్నే ప‌ట్టించుకోని ఆయ‌న తాను సైలెంట్ అయిపోవ‌డంతో పాటు త‌న కేడ‌ర్‌కు సైతం ప్ర‌భుత్వం మ‌న‌ది కాద‌మ్మా.. మరో మూడేళ్లు కాస్త త‌గ్గండి.. సైలెంట్‌గానే ఉండ‌డ‌ని చెపుతున్నార‌ట‌. పుల్లారావు స్వ‌యంగా ఈ మాట‌లు చెపుతుండ‌డంతో కేడ‌ర్‌లో సైతం ఆత్మ‌విశ్వాసం స‌న్నగిల్లుతోంది.

దీనికి కార‌ణం.. ఇప్పుడు టీడీపీ కీల‌క నేత‌ల‌పై.. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కారు కేసులు పెడుతున్న నేప‌థ్యంలోనే పుల్లారావు.. ఇలా ఒణికి పోతున్నార‌ట‌. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం లిస్టులో పుల్లారావు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సైలెంట్‌గా ఉన్నార‌ని తమ్ముళ్లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. పుల్లారావు లాంటి సీనియ‌ర్ నేతే ఇలా వెన‌క‌డుగు వేస్తుంటే ? అస‌లు పార్టీ కేడ‌ర్‌లో ధైర్యం ఎలా ఉంటుంద‌న్న‌ది స‌గ‌టు కార్య‌క‌ర్త ప్ర‌శ్న‌.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)