సోము స్వయంకృతం… అహంకార‌మే చేటు చేస్తోందా..?

ఏపీ బీజేపీ సార‌థి.. ఆర్ ఎస్ ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు సోము వీర్రాజు ప‌రిస్థితి ఇప్పుడు అడ‌క‌త్తెరలో పోక మాదిరిగా మాదిరిగా మారిందా ? ఇప్పుడు ఆయ‌న ఏం మాట్లాడినా.. త‌న‌కు వ్య‌తిరేక‌తే ఎదుర‌వుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. కీల‌క‌మైన రెండు ఎన్నిక‌లు వ‌చ్చాయి. స్థానిక‌, కార్పొరేష‌న్‌, ఎన్నిక‌లు స‌హా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక కూడా వ‌చ్చింది. వీటిని బీజేపీకి అనుకూలంగా మారుస్తామ‌ని.. ఎట్టి ప‌రిస్తితిలోనూ విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని.. సోము అప్ప‌ట్లో వ్యాఖ్య‌లు సంధించారు.

అటు అధికార వైసీపీతో పాటు ఇటు విప‌క్ష టీడీపీని టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయేవారు. అదే స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన‌కు కూడా సోము విలువ ఇచ్చేవారే కాదు. అయితే.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి మాట‌ల క‌న్నా.. చేత‌లు కావాల‌నే విష‌యం సోము తెలుసుకునే స‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోయింది. పైగా.. ఏ ఎన్నిక‌ల‌ను తీసుకున్నా.. సోము ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు సీనియ‌ర్ల నుంచి వినిపిస్తున్నాయి. పైగా ఎన్నిక‌ల్లో అనుభ‌వం ఉన్న కొంద‌రిని ఆయ‌న ప‌క్క‌న పెట్ట‌డం.. త‌న‌కు అడ్డు వ‌స్తార‌నో.. లేక‌.. కొన్ని సామాజిక‌వర్గాల‌కు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాల‌న్న ధోర‌ణో… తెలియ‌దు కానీ.. మొత్తంగా చూస్తే.. సోము మాత్రం విఫ‌ల‌మ‌య్యార‌నేది వాస్త‌వం.

ఈ క్ర‌మంలో మ‌ళ్లీ.. పార్టీకి కొత్త ర‌క్తం ఎక్కించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అంటే.. సోమును పార్టీలోనే కొన‌సాగిస్తూ.. ఆయ‌న‌కు స‌మాంత‌రంగా.. మ‌ళ్లీ మ‌రో కీల‌క నేతను కేంద్రం నుంచి ఏపీకి దింపుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీరిలో ఎవ‌రైనా ఉండొచ్చ‌ని తెలుస్తోంది.
అంటే.. పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతారు త‌ప్ప‌.. వ్యక్తులు ప్రధానం కాద‌న్న‌ది బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

వాళ్ల‌కు క‌న్నా.. క‌న్నా కాక‌పోతే సోము.. సోము కాక‌పోతే విష్ణు.. ఇక్క‌డ ఎవ‌రికి సీన్ లేక‌పోయినా సులువుగానే ప‌క్క‌న పెట్టేస్తార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీ బీజేపీకి కొత్త నేత‌ను తీసుకువ‌స్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఏదేమైనా క‌న్నాను త‌ప్పించి సోముకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినా దానిని స‌ద్వినియోగం చేసుకోలేద‌న్న నిర్ణ‌యంతోనే కేంద్ర పెద్ద‌లు ఉన్న‌ట్టు టాక్ ?