దశాబ్దాలపాటు కంటిన్యు అవుతున్న రాజకీయ విధానాలకు స్వస్ధిచెప్పి కొత్త తరహా రాజకీయాలకు స్టాలిన్ తెరలేపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడే కొత్తతరహా రాజకీయాలకు స్టాలిన్ పునాదులేశారని చెప్పాలి. తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు ఏలిన పురట్చితలైవి జయలలిత, కలైంజ్ఞర్ ఎంకే కరుణానిధి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నిక ఇదే.
జయలిలత, కరుణానిధి ఎన్నికలకు చాలాముందే వెళిపోయారు కాబట్టి ప్రత్యేకించి ఇటు డీఎంకే అటు ఏఐఏడీఎంకే పార్టీలకు సానుభూతి అస్త్రాలు లేవనే చెప్పాలి. అందుకనే అధికారపక్షంగా ఏఐఏడీఎంకే, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే వేటి అస్త్రాలను అవి రెడీ చేసుకున్నాయి. సరే హోరాహోరీగా జరిగిన పోరులో డీఎంకే మంచి మెజారిటితో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే అమ్మ క్యాంటిన్లు కంటిన్యు చేస్తానని స్టాలిన్ ప్రకటించారు.
అలాగే కరోనా సంక్షోభాన్ని నియంత్రించేందుకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్నీ పార్టీల ఎంఎల్ఏలతో ఓ కమిటిని వేశారు. సీఎం హోదాలో స్టాలిన్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఆహ్వానించదగ్గవే. అయితే దీనికి భీజం ప్రతిపక్షంలో ఉన్నపుడే పడింది. ఎలాగంటే అప్పట్లో సీఎంగా పళనిస్వామి తల్లి చనిపోతే పరామర్శకు స్టాలిన్ వెళ్ళారు. పళనిస్వామి ఇంట్లోనే స్టాలిన్ దాదాపు అర్ధగంట కూర్చున్నారట.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో కానీ బయటకానీ ఎక్కడా ముఖ్యమంత్రిని కానీ లేదా జయలిలతపైన కానీ వ్యక్తిగతంగా ఒక్క ఆరోపణ కూడా చేయలేదట. అలాగే తమ ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా ఆదేశాలిచ్చారట. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా విధానపరమైనవే తప్ప వ్యక్తిగతంగా కాదట. అంటే ప్రతిపక్షంలో ఉన్నపుడే స్టాలిన్ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారనే విషయం అర్ధమవుతోంది. అదే పద్దతిని సీఎం అయిన తర్వాత కూడా కంటిన్యు చేస్తున్నారు.
పాత పద్దతిలోనే రాజకీయాలు నడుపుతుంటే ఈపాటికి డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధులపై ఎన్నిదాడులు జరిగేవో, ఎంత గందరగోళం జరుగుతుండేదో అందరికీ తెలిసిందే. ఏదేమైనా పాత పద్దతిలో కాకుండా కొత్తతరహా రాజకీయాలు చేయాలని స్టాలిన్ ప్రయత్నించటం అందరికీ శుభపరిణామమనే చెప్పాలి.