గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు మీద విమర్శలు చేసి వివాదాల్లోకెక్కిన డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా? ఆయన శుక్రవారం చనిపోయాడు. సుధాకర్ గుండెపోటుతో తనువు చాలించినట్లు తెలుస్తోంది. సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని.. ఆయన మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ డాక్టర్‌గా ఉన్న సుధాకర్.. వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కులు కూడా ఇవ్వట్లేదంటూ జగన్ సర్కారు మీద విమర్శలు, ఆరోపణలు చేసి వార్తల్లో నిలవడం, ఆ తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం, ప్రభుత్వం కేసులు కూడా పెట్టడం తెలిసిన సంగతే. తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఆయన విశాఖపట్నంలో రోడ్డు మీద దయనీయ స్థితిలో కనిపించారు. అర్ధ నగ్న స్థితిలో, మాట తడబడుతూ కనిపించిన సుధాకర్‌ను పోలీసులు ఆయన కాళ్లు చేతులకు తాళ్లు కట్టి.. కర్రలతో కొట్టడం.. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలించడం సంచలనం రేపింది.
ఈ ఘటన అనంతరం సుధాకర్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కోర్టు ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే కాక.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు ఆదేశించడం మరో సంచలనం. కాగా తర్వాత సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల విచారణ వ్యక్తం చేస్తూ, తన ఉద్యోగం తనకు ఇప్పించాలని మీడియా ముందు మాట్లాడారు. ఆ తర్వాత సుధాకర్ పెద్దగా వార్తల్లో లేరు. ఇప్పుడు సుధాకర్ కేసును అందరూ మరిచిపోయారు. ఈ టైంలో ఆయన మరణవార్త బయటికి వచ్చింది. ప్రభుత్వంపై విమర్శలు చేశాక జరిగిన పరిణామాలు సుధాకర్ మీద మానసికంగా తీవ్ర ప్రభావమే చూపినట్లుగా భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates