కరోనా వైరస్ రోగుల్లో ఆత్మ స్ధైర్యాన్ని నింపే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కేసీయార్ ను ఫాలో అయితే బాగుంటుంది. ముఖ్యమంత్రయిన దగ్గర నుండి కేసీయార్ గాంధి ఆసుపత్రిలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. తనకు ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైనా సోమాజిగూడలోని కార్పొరేట్ ఆసుపత్రికే వెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. కేసీయార్ గాంధిలో అడుగుపెట్టింది వైద్య పరీక్షల కోసంకాదు. కరోనా వైరస్ రోగులను పరామర్శించేందుకు.
అవును కరోనా రోగులకు ఆమడ దూరం ఉండమని స్వయంగా శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులే నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అయితే వాళ్ళ సూచనలకు విరుద్ధంగా కేసీయార్ బుధవారం గాంధి ఆసుపత్రిలో చికిత్స్ చేయించుకుంటున్న కరోనా రోగులతో దాదాపు గంటసేపు గడిపారు. ఆసుపత్రిలోని ఏడు వార్డుల్లోను తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఇప్పటికే కేసీయార్ కు కూడా కరోనా వచ్చి తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. సరే తగిన జాగ్రత్తలు తీసుకునే కేసీయార్ గాంధి ఆసుపత్రిని సందర్శించారు లేండి.
ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇపుడందరు జగన్మోహన్ రెడ్డిని కేసీయార్ తో పోల్చి చూస్తున్నారు. జగన్ కూడా కరోనా రోగుల పరామర్శలో కేసీయార్ నే ఆదర్శంగా తీసుకోవచ్చు కదా అనే చర్చ మొదలైంది. కరోనా సమస్య మొదలైన దగ్గర నుండి జగన్ జనాల్లోకి వచ్చిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. ఇది ఒకరి నుండి కొన్ని వందలమందికి చాలా స్పీడుగా వ్యాపిస్తుంది కాబట్టే కరోనా రోగులకు అందరు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డాక్టర్లు, వైద్యసిబ్బంది కూడా అన్నీ జాగ్రత్తలు తీసుకునే రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఇపుడు జగన్ కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకునే ఏదైనా ఆసుపత్రిలో రోగులను పరామర్శిస్తే బాగుంటుందని జనాల్లో టాక్ మొదలైంది. స్వయంగా ముఖ్యమంత్రే పరామర్శిస్తే రోగులు, బంధువుల్లో ఆత్మస్ధైర్యం పెరుగుతుందన్నది వాస్తవం. అలాగే ఆసుపత్రుల్లో ఎక్కడైనా లోపాలుంటే వెంటనే వాటిని సవరిస్తారు కూడా. మామూలుగా కేసీయార్ నెలల తరబడి ఎవరికీ అందుబాటులో ఉండరు. అలాంటిది కేసీయారే గాంధీ ఆసుపత్రిని సందర్శించినపుడు జగన్ కూడా ఏదైనా ఆసుపత్రిని సందర్శిస్తే బాగుంటుందని జనాలనుకుంటున్నారు.