నిజమే… ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే… టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… మొన్నటిదాకా తన కేబినెట్ లో ఓ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ ను చూసి బాగానే భయపడినట్టున్నారు. ఈటలను ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్… ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. త్వరలో అది కూడా జరిగే తీరుతుందన్న వాదనలైతే వినిపిస్తున్నాయి. కేబినెట్ నుంచి గెంటేయబడ్డా… ఈటల ఇంకా టీఆర్ఎస్ నేత కిందే లెక్క. అయినా ఓ పార్టీకి అధినేతగానే కాకుండాన… రాష్ట్రానికి సీఎంగా ఉన్న కేసీఆర్ తన కేబినెట్ లోని ఓ మంత్రికి, పార్టీలోని ఓ సీనియర్ నేతకు ఎందుకు భయపడతారు? అయితే ఇటీవల వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు చూద్దాం పదండి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. తన కేబినెట్ లో కుమారుడు కేటీఆర్‌తో పాటు మేనల్లుడు హరీశ్ రావులకు సరిసమానమైన ప్రాధాన్యతతో ఈటల రాజేందర్ కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా అసలు ఈటలకు మంత్రి పదవి దక్కుతుందా? అన్న అనుమానాలు కలిగాయి. అయితే ఈటలకు మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీలో ఏదో జరుగుతుందన్న భావనను తనకు తానే కలిగించినట్టవుతుందన్న భావనతో 2018లోనూ ఈటలకు మంత్రి పదవి దక్కింది.
తాజాగా పార్టీలో ఓ రేంజిలో ఎదిగిపోతున్నాడన్న భావనతో ఈటలకు చెక్ పెట్టేసిన కేసీఆర్.. చడీచప్పుడు లేకుండా ఈటలను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిపారేశారు. అందుకు ఏవో కొన్ని అవినీతి ఆరోపణలను బయటపడేలా చేసి బర్తరఫ్ కార్యక్రమాన్ని ముగించారు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా… సీఎం పదవి అంటే తన కేబినెట్ లోని మంత్రులకు కేటాయించిన అన్ని ప్రభుత్వ శాఖలను కూడా పర్యవేక్షించే సర్వోన్నత అధికారాలు కలిగిన పదవే. ఏవో కొన్ని శాఖలను మంత్రులకు కేటాయించకుండా కొందరు సీఎంలు వాటిని తమ వద్దే ఉంచుకుంటారు. ఇందుకు పలు కారణాలు ఉండవచ్చు.
అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే… ఈటల ఆధ్వర్యంలోని వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన సమీక్షకు కూడా కేసీఆర్ మొన్నటిదాకా ధైర్యం చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈటలను బర్తరఫ్ చేసిన వెంటనే…కరోనా ఉధృతంగా ఉన్నా కూడా బుధవారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్… గురువారం ఏకంగా వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి కూడా వెళుతారట. అంటే… ఇన్నాళ్లుగా ఈటల నేతృత్వం వహిస్తున్నందుననే కేసీఆర్… వైద్య, ఆరోగ్య శాఖ జోలికి వెళ్లలేదన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా ఈ ఒక్క ఘటనతో ఈటల అంటే కేసీఆర్ బాగానే భయపడిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates