20వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న పినరయి విజయన్ మంత్రివర్గం విషయంలో సీపీఎం కొత్త ప్రయోగం చేయబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తోంది. ఎల్డీఎఫ్ కూటమిలో సీపీఎం ప్రధాన భాగస్వామి. కూటమిలోని ఇతర పార్టీల సభ్యులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.
అయితే సీపీఎం తరపున మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నవారంతా కొత్తవారే. ఇప్పటివరకు మంత్రులుగా బాధ్యతలు చూసిన వారిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకూడదని సీపీఎం నిర్ణయించింది. ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, మంత్రులుగా ఎవరుండాలనే విషయాన్ని కేరళలో సీపీఎం పార్టీయే నిర్ణయిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.
కొత్త మంత్రివర్గంలో సీపీఎం తరపున 12 మంది ప్రాతినిధ్యం వహించబోతున్నారు. మొత్తానికి 12మందిని కొత్తవారినే సీపీఎం పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభంలో కష్టపడి పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్న కేకే శైలజకు కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కొత్తవారిని+యువతకు మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలన్న పార్టీ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ నేత ఏఎస్ షంసీర్ స్పష్టం చేశారు.