ఎంత రద్దీ తక్కువున్న సమయంలో తిరుమలకు వెళ్లినా, ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నా.. శ్రీవారి దర్శనం పూర్తి కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంటుంది. గత కొన్నేళ్లలో పరిస్థితులు ఎంతో మెరుగు పడ్డాయి కానీ.. ఒకప్పుడు సర్వదర్శనం కోసం 10-20-30 గంటలు కూడా పట్టేసేది. తర్వాత పరిస్థఙతులు మారాయి. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే గంటన్నర నుంచి నాలుగైదు గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది. మరీ తక్కువ సమయంలో దర్శనం పూర్తి కావాలంటే.. వీఐపీ బ్రేక్ దర్శనమే మార్గం. అందులో వెళ్తే అర గంట లోపే దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చేయొచ్చు. ఐతే ఇప్పుడు తిరుమలలో భక్తులందరూ వీఐపీ హోదా అందుకునే పరిస్థితులు వచ్చేశాయి. ఎవరు దర్శనానికి వెళ్లినా పావు గంట నుంచి అరగంటలోపు దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చేస్తుండటం విశేషం.
కొవిడ్ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలా చోట్ల లాక్ డౌన్ అమలవుతుండటంతో శ్రీవారి దర్శనం గురించి ఎవరూ ఆలోచించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా, పక్క జిల్లాల వాళ్లు మాత్రమే దర్శనానికి వస్తున్నారు. గత ఏడాది లాక్ డౌన్ టైంలో కొన్ని నెలల పాటు దర్శనాలే ఆపేశారు. ఆ తర్వాత ఎన్నో షరతులు పెట్టారు.
అయితే ఇప్పుడు ఏపీలో కర్ఫ్యూ ఉంది కానీ.. శ్రీవారి దర్శనానికి ఆంక్షలేమీ లేవు. రోజుకు 20 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. కానీ ప్రస్తుతం రోజు మొత్తంలో 5 వేల మందికి మించి దర్శనం చేసుకోవట్లేదట. దీంతో భక్తులను క్యూ లైన్లలో కాకుండా నేరుగా సింహ ద్వారం నుంచే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇది ఒక రకంగా వీఐపీ బ్రేక్ దర్శనం లాంటిదే. దీంతో 15-20 నిమిషాల్లోనే దర్శనం పూర్తి చేసుకుని పరమానందం పొందుతున్నారు భక్తులు.