కోవాగ్జిన్ సూప‌రో సూప‌ర్

మేడిన్ ఇండియా కోవాగ్జిన్ గురించి కొన్ని నెలల ముందు చాలామంది త‌క్కువ చేసి మాట్లాడారు. దాని నాణ్య‌తపై సందేహాలు వ్య‌క్తం చేశారు. బేసిగ్గా లోక‌ల్ టాలెంట్ మీద మ‌నకుండే చిన్న చూపు కూడా అందుకు కార‌ణం కావ‌చ్చు. మ‌న వ్యాక్సిన్ మీద మ‌న వాళ్లే సందేహాలు వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో.. ప‌రోక్షంగా కోవాగ్జిన్‌ను నీటితో పోలుస్తూ సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదార్ పూన‌వాలా చేసిన కామెంట్ దుమారం రేప‌డం.. దీనిపై భార‌త్ బ‌యోటెక్ అధినేత కృష్ణ ఎల్లా తీవ్రంగా స్పందించ‌డం తెలిసిన సంగ‌తే.

ఇక్క‌డ క‌ట్ చేస్తే కోవాగ్జిన్ ప‌నితీరు ప‌ట్ల త‌ర్వాత దేశీయంగానే కాదు.. అంత‌ర్జాతీయ స్థాయిలోనూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్ర‌పంచంలో త‌యారైన అత్యుత్త‌మ వ్యాక్సిన్ల‌లో దీన్ని ఒక‌టిగా పేర్కొన్నారు. కోవాగ్జిన్ వేసుకున్న వారిలో యాంటీ బాడీలు స‌మృద్ధిగా త‌యారు కావ‌డం, క‌రోనాను నియంత్రిండ‌చంలో ఈ వ్యాక్సిన్ స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌డంతో మ‌న టీకాకు ప్ర‌పంచ స్థాయిలో ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

వ్యాక్సినేష‌న్ మొద‌లైన కొత్త‌లో ఎక్కువ‌మంది కోవిషీల్డ్ కావాలంటే.. ఆ త‌ర్వాత భిన్న‌మైన ప‌రిస్థితి త‌లెత్తింది. కోవాగ్జిన్ ప‌నితీరుపై అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు రావ‌డం, సైడ్ ఎఫెక్ట్స్ కూడా త‌క్కువ‌గా ఉండ‌టంతో అంద‌రూ ఆ టీకానే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా కోవాగ్జిన్ ప‌నితీరు ఎంత గొప్ప‌గా ఉందో చెప్పే మ‌రో రుజువు దొరికింది. క‌రోనా కొత్త వేరియంట్ల మీదా ఈ టీకా స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీతో క‌లిసి ఐసీఎంఆర్ జ‌రిపిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంది.

క‌రోనా ఎప్ప‌టిక‌ప్పుడు రూపం మార్చుకుంటుండ‌టం.. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుండ‌టం తెలిసిన సంగ‌తే. కొత్త వేరియెంట్ల గురించి తెలియ‌డానికి ముందే వ్యాక్సిన్లు త‌యారైన నేప‌థ్యంలో వాటిపై టీకా ఏమేర ప‌ని చేస్తుందో అన్న సందేహాలు లేక‌పోలేదు. ఐతే కోవాగ్జిన్ విష‌యంలో అలాంటి సందేహాలేమీ లేవ‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. ఇప్ప‌టిదాకా ఇండియాలో గుర్తించిన అన్ని వేరియెంట్ల మీదా కోవాగ్జిన్ స‌మ‌ర్థంగా ప‌ని చేస్తోంద‌ని ఐసీఎంఆర్ తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది.