జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెక్ట్స్ స్టెప్ ఏంటి? పొలిటికల్‌గా ఆయన ఎలాంటి టర్న్ తీసుకుంటారు ? బీజేపీతోనే కొనసాగుతారా ? లేక .. కమలంతో కటీఫ్ చెబుతారా ? అనేది ఆసక్తిగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్న పవన్‌కు ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలతో పవన్‌కు విభేదాలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాను సహకరించినా.. తనను తన పార్టీ నేతలను బీజేపీ నేతలు అవమానించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. దీంతో తెలంగాణలో బీజేపీతో దాదాపు జనసేన డిస్టెన్స్ పాటిస్తోందని తెలుస్తోంది.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత.. కూడా బీజేపీ నేత ఇక్కడ విజయం దక్కించుకోలేదు. దీంతో కొందరు బీజేపీ నేతలు అత్యుత్సాహంతో.. పవన్ ప్రచారం చేసినా.. ఓడిపోయాం.. ఇక, మా బలమే మాకు రక్ష..! అని కామెంట్లు చేశారు. ఇది పవన్‌ను తీవ్రంగా బాధించింది. అయితే.. ఆయన అప్పటికే కరోనా బారిన పడడంతో ఈ విషయాన్ని పెద్దగా హైలెట్ చేయలేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో ఇక, ఏపీ బీజేపీతో కూడా ఆయన కటీఫ్ చెబుతారనే వాదన వినిపిస్తోంది. కానీ, పవన్‌కు కేంద్రంలోని బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉండడంతో ఆయన అంత తేలికగా.. ఈ బంధాన్ని వదులుకుంటారా ? అనేది చూడాలి.
ఇక, పవన్ కలిసి వస్తే.. స్నేహం చేసేందుకు అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీలు సిద్ధంగా ఉన్నాయి. టీఆర్ఎస్ లోపాయికారీగా ఇప్పటికే.. పవన్‌తో మంతనాలు చేస్తోందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరిన్ని పార్టీలు పుట్టుకొచచ్చే అవకాశం ఎక్కువగా ఉండడంతో తమకు ఇబ్బందికర పరిస్థితి తప్పదని భావిస్తున్న టీఆర్ఎస్.. పవన్ పార్టీని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.
ఇక, 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో జతకట్టిన ఫలితంగానే బాబు అధికారంలోకి వచ్చారనే వాదన ఉంది. 2019లో పవన్‌ను దూరం పెట్టడం వల్లే అధికారం కోల్పోయామనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో నూ వచ్చే ఎన్నికల్లో భారీ సమీకరణలు ఉండే నేపథ్యంలో పవన్‌తో కలిసి అడుగులు వేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.