ఒకే రోజు హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న నాలుగు ఆత్మహత్యల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. అసలీ నగరానికి ఏమైందన్న ప్రశ్న మనసుకు కలుగక మానదు. ఒకే రోజులో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న నాలుగు ఆత్మహత్యల వెనుకున్న కారణాలు తెలిస్తే నోట మాట రాదంతే. ఇలాంటి వాటికి కూడా ఆత్మహత్య చేసుకుంటారా? అన్న సందేహం కలుగక మానదు.
ఆందోళన రేకెత్తించేలా ఉన్న ఈ తరహా ఆత్మహత్యల్ని హైదరాబాద్ నగరంలో ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండని పరిస్థితి. అంతకంతకూ పొడిగిస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో అయినోళ్లను.. కుటుంబ సభ్యుల్ని చూడలేకపోతున్నామన్న వేదన.. మానసికంగా కుంగిపోతున్న వారు.. చివరకు ఆత్మహత్య చేసుకుంటున్న వైనాలు పెరుగుతున్నాయి. మణికొండకు చెందిన 20 ఏళ్ల యువతి(శ్రీవల్లి) అపార్ట్ మెంట్ లోని పదిహేనో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది.ఆమె ఆత్మహత్యకు కారణం.. తన సోదరికి బాబు పుడితే.. తాను వెళ్లి చూడలేకపోతున్నానన్న వేదనను తట్టుకోలేక సూసైడ్ చేసుకోవటం.
ఆమె సోదరి ఏపీలోని నందిగామలో ఉంటారు. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నందిగామకు రావటం కష్టమని తల్లి చెప్పటాన్ని జీర్ణించుకోలేకపోయిన శ్రీవల్లి సూసైడ్ చేసుకుంది. మరో ఉదంతంలో భర్త సిరిసిల్లలో ఉండటం.. కొడుకు కెనడాలో ఉండటం.. కుటుంబం అంతా ఒక దగ్గర లేకపోవటంతో వేదనకు గురయ్యారు చిక్కడపల్లికి చెందిన 57 ఏళ్ల లక్ష్మి. లాక్ డౌన్ కారణంగా విదేశాల నుంచి కొడుకు రాలేకపోవటం.. వేరే రాష్ట్రంలో ఉన్న భర్తను కలవలేని వైనంతో ఆమె వేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఏపీలోని ఒంగోలు జిల్లా కూచిపూడికి చెందిన 30 ఏళ్ల శాంతి హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సొంతూరు వెళ్లలేకపోతున్న వేదనతో ఉన్న ఆమె తాజాగా ఉరివేసుకొని మరణించారు. ఇదే తరహాలో బర్కత్ పురకు చెందిన 75 ఏళ్ల వెంకన్న అనే పెద్దాయన.. స్వగ్రామానికి వెళ్లలేకపోతున్నారు. తన సొంతూరైన సూర్యాపేటకు వెళ్లలేని దైన్యానికి వేదన చెందిన ఆయన ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాక్ డౌన్ సుదీర్ఘంగా సాగుతుండటంతో.. మానసిక వేదనతో సూసైడ్లు చేసుకుంటున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.