తాజాగా ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్లే జనాల్లో ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అందరికీ టీకాలు వేయించాలంటే 7 కోట్ల డోసులు అవసరం. అయితే ప్రస్తుతం టీకాలను ఉత్పత్తిచేస్తున్న రెండు పార్మా కంపెనీల ద్వారా కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలు కలిపి నెలకు అందుతున్నది 10 లక్షల డోసులు కూడా ఉండటంలేదు. ఒకవైపు టీకాల కోసం పెరిగిపోతున్న డిమాండ్లు మరోవైపు డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేని కంపెనీలు.
ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి టీకాల సరఫరా కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని అనుకున్నారు. అందుకనే ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. టెండర్ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ సరఫరా ఆర్డర్ పొందే సంస్ధే కేంద్రంనుండి అనుమతులు తెచ్చుకోవాలి. టెండర్ ఫైనలైజ్ అయిన రెండు నెలల్లోగా కేంద్రంనుండి అనుమతులు పొందాలి. మూడో నెలనుండి వ్యాక్సిన్ పంపిణి మొదలుపెట్టేయాలి.
టెండర్ నిబంధనల ప్రకారం నెలకు కనీసం 25 లక్షల డోసులు సరఫరా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనలను నూరుశాతం ఫుల్ ఫిల్ చేయగలమని నమ్మకమున్న కంపెనీలే టెండర్లలో పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. 75 శాతం టీకాలు సరఫరా అయిన తర్వాత మాత్రమే ఒప్పందం చేసుకున్న ధరలో 50 శాతం బిల్లులు చెల్లిస్తుంది. టెండర్ నిబంధనలు బాగానే ఉన్నాయికానీ అవి ఆచరణ సాధ్యమేనా అనే డౌటు మొదలైంది.
మనదేశంలో ప్రతి అనుమతికి నెలలు, సంవత్సరాలు పడుతుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ప్రతిదీ బాగా ఆలస్యమైపోతోంది. దేశీయంగా ఉన్న కంపెనీలు అనుమతులు తెచ్చుకోవటమే చాలా కష్టం. అలాంటిది విదేశీకంపెనీలు మనదేశంలో అనుమతులు తెచ్చుకోవటమంటే మామూలు విషయంకాదు. పైగా 75 శాతం టీకాల పంపిణీ అయిన తర్వాత 50 శాతం బిల్లులు చెల్లిస్తామనే నిబంధనను ఎన్ని కంపెనీలు సానుకూలంగా ఉంటాయో తెలీదు. కాబట్టి గ్లోబల్ టెండర్ల వల్ల ఎంత ఉపయోగం అన్నది కాలమే నిర్ణయించాలి.