వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత తదితర విషయాల్లో తన డొల్లతనం బయటపడుతుందనే సుప్రింకోర్టు జోక్యాన్ని కేంద్రప్రభుత్వం అడ్డుకుంటున్నట్లుంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభసమయంలో వ్యాక్సినేషన్ విషయంలో సుప్రింకోర్టు జోక్యం అవసరం లేదని కేంద్రం తెగేసి చెప్పింది. ఒకవేళ సుప్రింకోర్టు గనుక జోక్యం చేసుకుంటే ముందెన్నడు చూడని అనాలోచిత పరిణామాలను చూడాల్సొస్తుందని ఏకంగా హెచ్చరికలే జారీచేసింది.
నిజానికి దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం ముదిరిపోవటానికి నరేంద్రమోడి చేతకానితనమే ప్రధాన కారణంగా దేశవ్యాప్తంగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సీసీఎంబి, ఐఎంఏ లాంటి సంస్ధలు కూడా మోడినే దుమ్ముదులిపేస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితులను తాము ఫిబ్రవరి-మార్చిలోనే హెచ్చరించినా మోడి పట్టించుకోలేదంటూ మండిపోతున్నారు శాస్త్రజ్ఞులు, వైద్యనిపుణులు.
ఐదురాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై పెట్టిన దృష్టి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను అరికట్టడంలో చూపలేదంటు దేశవ్యాప్తంగా గోల పెరిగిపోతోంది. ఇటువంటి కారణాల వల్లే సుప్రింకోర్టు సూమోటోగా కేసును టేకప్ చేసింది. అందరికీ టీకాలు వేయటంలో, ఆక్సిజన్ అందించటంలో కేంద్రం విఫలమైనట్లు తేల్చేసింది. అందుకనే లాక్ డౌన్ పెట్టే విషయంతో పాటు వ్యాక్సినేషన్, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాపై కౌంటరు దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులిచ్చింది.
ఆ నోటీసుకు సమాధానంగానే సుప్రింకోర్టు జోక్యం అవసరంలేదంటు కేంద్రం స్పష్టంచేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వైద్యనిపుణుల సలహాలు, సూచనలతోనే టీకా విధానాన్ని రూపొందించినట్లు అఫిడవిట్ ఫైల్ చేసింది. అయితే తమ సూచనలు, సలహాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదని వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు మండిపోతున్న విషయం గమనార్హం.
మొత్తానికి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణలో ఫెయిలైన మోడి చేతులెత్తేసింది వాస్తవం. టీకాలు వేయటం, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో కూడా బాగా పక్షపాతంతోనే కేంద్రం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్ధితిలో సుప్రింకోర్టు జోక్యం చేసుకుంటే తన బండారం బయటపడుతుందన్న కారణంతోనే అత్యున్నత న్యాయస్ధానం జోక్యాన్ని కేంద్రం అంగీకరించటంలేదు. మరి కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.