128 సంవత్సరాల తర్వాత తొలిసారి తిరుమల భక్తుల లేకుండా బోసిపోయింది. ఆలయం మూసివేయలేదు గాని భక్తులను మాత్రం ఎవరినీ అనుతించలేదు. కరోనా కారణంగా బంధువులే అంటరాని వాళ్లయిపోయిన నేపథ్యంలో నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల ఆలయ దర్శన భాగ్యం మార్చి నుంచి పూర్తిగా బంద్ అయ్యింది. త్వరలో ప్రత్యేక దర్శన ప్రణాళికతో భక్తులకు స్వామి వారి తలుపులు తెరవనున్నారు.
అయితే, మునుపటి వాతావరణం ఉండదు. బుకింగ్ ఉన్న వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. అలిపిరి వద్దే చెకింగ్ చేసి దర్శనం టిక్కెట్ ఉన్నవారికే కొండపైకి అనుమతి ఉంటుంది. ఇకపై గంటకు 500 మంది చొప్పున కేవలం 14 గంటలు మాత్రమే దర్శనం కల్పిస్తారు.
తిరుమల ఉద్యోగులకు తొలుత దర్శనం కల్పిస్తారు. మూడు రోజుల పాటు దీనిని పరీక్షిస్తారు. అనంతరం కొద్దిరోజులు స్థానికులకు మాత్రమే అంటే తిరుమల, తిరుపతి, చిత్తూరు ప్రజలకు దర్శనం కల్పిస్తారు. తర్వాత దశలో అందరికీ దర్శన భాగ్యం ఉంటుంది.
నిత్యకళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోయిన తిరుమల కరోనా కాటుకు వెలవెలబోయింది. ఇపుడున్న జనరేషన్లో ఎవరూ ఇలా ఖాళీగా తిరుమలను చూడలేదు. కరోనా వల్ల అది కూడా చూశాం. అంటే ఇక నుంచి చాలా అరుదుగా స్వామి వారి దర్శనం దొరుకుతుంది. అది కూడా అదృష్టం అన్నమాట.