అత్యంత కీలకమైన నియోజకవర్గంలో పాగా వేయడం ద్వారా చరిత్ర సొంతం చేసుకున్న వైసీపీకి ఈ రికార్డు ఎక్కువ కాలం నిలిచేలా లేదన్న పరిస్థితే కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి రికార్డులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్నింటిని వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ.. ఒకటి రెండు మాత్రం మరీ అత్యంత కీలకంగా ఉన్నాయి. వైఎస్ ప్రభంజనం ఉన్న 2004, 2009లోనూ గెలవని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎరిగేలా చేశాడు జగన్. ఇలాంటి వాటిలో అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం ఒకటి. ఇది వాస్తవానికి టీడీపీకి కంచుకోట. 1993 నుంచి 2014 వరకు ఇక్కడ టీడీపీనే పాగా వేసింది. వరుస విజయాలతో దూసుకుపోయింది.
దీనికి ముందు కూడా 1985లోనూ టీడీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది. అలాంటి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన బీకే పార్థసారథిని గత ఎన్నికల్లో వైసీపీ నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణ ఓడించి విజయం దక్కించుకున్నారు. అయితే.. 15 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే శంకరనారాయణకు లభించింది. టీడీపీ కంచుకోటలో గెలవడం గ్రేటే అనుకుంటే.. ఆయనకు మంత్రి పదవి కూడా ఉంది. ఈ ప్లస్‌లతో ఆయన మరింత పటిష్టం అవ్వాలి.
కానీ, ఆదిశగా శంకరనారయణ ప్రయత్నాలు చేయకపోగా.. ఉన్న పరపతిని కూడా పూర్తిగా పోగోట్టుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండకపోగా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదని ప్రజల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం. ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. దీంతో గ్రూపు తగాదాల ఉచ్చులో మంత్రి చిక్కుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన నాన్ లోకల్ అంటూ పార్టీ నేతలు కొత్త నినాదం అందుకున్నారు. రెడ్డి వర్గం నేతలు ఆయనపై గుస్సాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని ఆయన గ్రహించారని కూడా తెలుస్తోంది.
ఈ క్రమంలో నియోజకవర్గం ఎలా పోతే మాకేంటి? అనే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారని.. కేవలం అనంతపురం కేంద్రంలోనే ఉంటూ.. నియోజకవర్గంపై అసలు దృష్టి కూడా పెట్టడం లేదని తెలుస్తోంది. త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో ఆయన పదవి రెన్యువల్ కాదనే రాష్ట్ర స్థాయిలో వినిపిస్తోన్న టాక్ ? మరో వైపు టీడీపీ చాప కింద నీరులా.. తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీకి పెనుగొండ కంచుకోట కావడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ పెద్ద కష్టపడాల్సిన పనిలేకుండానే సత్తా చాటే ఛాన్సులే ఉన్నాయి.