తమిళనాడు ఎన్నికల తర్వాత కమలహాసన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మక్కళ్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) పేరుతో కమల్ మూడేళ్ళ క్రితమే ఓ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. మొదటిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పాల్గొంది. తాజా ఎన్నికల్లో 234 సీట్లకు గాను పార్టీ 150 చోట్ల పోటీచేసింది. అయితే ఒక్కరంటే ఒక్కరు కనీసం అధినేత కమల్ హాసన్ కూడా గెలవలేదు. మొదట్లో ధక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గంలో కమల్ గెలుస్తారనే అనుకున్నా చివరకు ఓడిపోయారు.
పార్టీ తరపున పోటీచేసిన 150 మంది అభ్యర్ధులందరు ఓడిపోవటమే దెబ్బంటే తాజాగా పార్టీకి నేతలు చాలామంది రాజీనామాలు చేసేస్తున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ రాజీనామా చేయటం కలకలం రేపింది. మహేంద్రన్ రాజానామా చేస్తు పార్టీపై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే వాటిని కమల్ కొట్టిపారేశారు. మహేంద్రన్ రాజీనామా చేయకపోతే పార్టీని బయటకు సాగనంపేదని కమల్ ఎదురు దాడి మొదలుపెట్టారు.
ఉపాధ్యక్షునితో పాటు కీలకనేతలైన ఏకే మౌర్య, మురగనందమ్, సీకే కుమారవేల్, ఉమాదేవి కూడా రాజీనామాలు చేసినట్లు పార్టీయే అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు వచ్చి వారంరోజులు కూడా కాకుండానే వరుసబెట్టి సీనియర్లు రాజీనామాలు చేయటం పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. ఇంకా ఎంతమంది సీనియర్లు రాజీనామాల బాటలో వెళతారో తెలీదు. మొత్తానికి మహేంద్రన్ను ద్రోహిగా కమల్ వర్ణించటం ఆశ్చర్యంగా ఉంది.
రాజీనామాలు చేసిన నేతల సంగతి పక్కనపెట్టేస్తే కమలహాసన్ పరిస్దితే అయోమయంగా మారింది. పార్టీలో సీనియర్లు లేకుండా ఒక్కళ్ళే నెట్టుకురావటం మామూలు విషయం కాదు. పైగా కమల్ పార్టీకే 24 గంటలూ కేటాయించటంలేదు. అవకాశం ఉన్నపుడు సినిమాల్లో కూడా నటిస్తునే ఉన్నారు. అంటే కమల్ రెండు పడవులపై ప్రయాణం చేస్తున్న విషయం వాస్తవం. ఏకకాలంలో రెండుపడవులపై ప్రయాణంసాగదన్న విషయం తెలియటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.