రాజకీయాల్లో ఆవేశాలు-ఆక్రోశాలు కామన్. తమకు ఆశించిన విధంగా న్యాయం జరగకపోయినా.. తమకు అనుకున్న విధంగా పదవులు లభించకపోయినా.. నాయకులు అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై కొన్నిసార్లు సంచలన ప్రకటనలు చేస్తుంటారు. అయితే.. కొన్నాళ్లకు మళ్లీ వాటిని మరిచిపోయి.. యథా విధిగా తమ రాజకీయాలు కొనసాగిస్తారు. ఇప్పుడు ఇలాంటి బాపతు నాయకులు టీడీపీలో పెరుగుతున్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు నచ్చకో.. లేక పార్టీ పరిస్థితిపై వారికి అనుమానంతోనో.. ఇటీవల కాలంలో సంచలన ప్రకటనలు చేస్తున్నారు.
ఇలా.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఆవేశానికి లోనయ్యారు. చంద్రబాబు మంత్రి వర్గంలో గత ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని దక్కించుకోవాలని భావించారు. అయితే.. అనూహ్యంగా బాబు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో అప్పట్లోనే కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. అయితే.. గత ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు ఆయనకే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, వైసీపీ సునామీని తట్టుకుని కూడా నిలబడడం వంటివి తెలిసిందే. ఇక, కొన్నాళ్ల కిందట.. చంద్రబాబు ఓ హింటిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే.. పూర్తిగా యువతకే పగ్గాలు అప్పగిస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. పార్టీలో 33 శాతం యువతకు ప్రాధాన్యం ఉంటుందని, వారికే అవకాశం ఇస్తానని అన్నారు. దీంతో ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి ప్రయాస పడి గెలిచినా.. యువత కోటా పెరుగుతుందికనుక.. తనకు అవకాశం చిక్కదని భావించిన గోరంట్ల.,. వెంటనే సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరమవుతానని ప్రకటించారు. అదే సమయంలో తన వారసుడిని కూడా ప్రకటించారు.
ఇది జరిగి నాలుగు మాసాలు అయింది. అయితే.. ఈ నాలుగు మాసాల్లోనూ పార్టీలో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. యువతకు పగ్గాలు అప్పగించినా.. ప్రజలకు రిసీవ్ చేసుకునే అవకాశం లేదని గుర్తించిన చంద్రబాబు.. తనే మళ్లీ సీఎం అవడం, సీనియర్లకే ప్రాధాన్యం ఉంటుందని మళ్లీ హింటిచ్చారు. దీంతో మళ్లీ గోరంట్ల తన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయన చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో తనకు తిరుగులేదని.. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపుతనదేనని చెప్పుకొచ్చారు. దీంతో గోరంట్ల వ్యాఖ్యలు కేవలం ఆవేశంతో చేసినవేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates