కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లే. వైసీపీ ఎంఎల్ఏ డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. నిబందనల ప్రకారం సభ్యుడు మరణంతో ఖాళీ అయిన స్ధానంలో ఆరుమాసాల్లోగా ఉపఎన్నిక జరపాలి. ఈ లెక్కన సెప్టెంబర్ 28వ తేదీలోగా ఎన్నిక జరగాల్సుంది. అయితే హఠాత్తుగా వచ్చి మీదపడిన కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి కారణంగా ఉపఎన్నిక నిర్వహణ సాధ్యంకాదని కేంద్ర ఎన్నికల కమీషన్ తేల్చేసింది.
ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు అంతకుముందు జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే అక్కడక్కడ జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల కారణంగా కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయిందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ప్రభుత్వాలపై అనేక రూపాల్లో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
మొన్ననే జరిగిన ఐదురాష్ట్రాల్లో గెలుపే టార్గెట్ గా లాక్ డౌన్ విధించటం కానీ, ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయలేకపోయినందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ పై సుప్రింకోర్టుతో పాటు తమిళనాడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. పెరిగిపోతున్న కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వాలన్నీ నానా అవస్తలు పడుతున్నాయి.
జరుగుతున్న డెవలప్మెంట్లను దృష్టిలో పెట్టుకునే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక నిర్వహణను నిరవధికంగా వాయిదా వేయాలని కమీషన్ నిర్ణయించింది. కరోనా వైరస్ పరిస్దితులన్నీ చక్కబడిన తర్వాతే ఉపఎన్నిక నిర్వహణ గురించి ఆలోచించాలని తేల్చేసింది. మొత్తానికి కోర్టులు ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తర్వాత కానీ కమీషన్ కు తత్వం బోధపడలేదన్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates