ఏపీలో విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు.. రాజకీయ విశ్లేషకుడు.. సబ్బం హరి కన్నుమూశారు.. గడిచిన 15 రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతున్నారు. కరోనా సోకడంతో ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, నాలుగు రోజుల కిందటే ఆయన ఆరోగ్యం విషమించిందనే వార్తలు వచ్చాయి. అయితే.. మరింత మెరుగైన వైద్యం అందించడంతో అప్పట్లో కోలుకున్నారు. కానీ, తాజాగా 24 గంటలుగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించింది.
ఈ నేపథ్యంలో సబ్బం హరి కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. కాగా, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హరి.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈ క్రమంలోనే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన 2009లో విజయం దక్కించుకున్నారు. అంతకుముందు.. విశాఖపట్నం మేయర్‌గా కూడా సబ్బం పనిచేశారు. అయితే.. అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ తనకంటూ.. ప్రత్యేకతను సంతరించుకున్న సబ్బం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు.
సమైక్య ఉద్యమంలో పాల్గొని పోరాటం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీతోనూ విభేదించి బయటకు వచ్చారు. ఇక, 2014 ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునా ఆయన పోటీ చేయకుండా తటస్థంగా ఉండిపోయారు. ఇక, గత 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన హరి.. ఎమ్మెల్యేగా భీమిలి నుంచి పోటీ చేశారు. అయితే.. వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాస్‌పై ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆయన రాజకీయాలపై విశ్లేషణలు చేస్తున్నారు.
వాస్తవానికి ఆదిలో ఆయనకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందని.. అంటారు. కానీ, సబ్బం హరి మాత్రం.. ఎన్నడూ ఆ పార్టీ జోలికి వెళ్లలేదు. అదేసమయంలో వైసీపీ అధినేత జగన్‌పై పదునైన విమర్శలు చేయడంలోను, ఆ పార్టీ నేతల అక్రమాలను బయట పెట్టడంలోనూ హరి ఎప్పుడూ ముందుండడం గమనార్హం. కాగా.. సబ్బహరి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates