ఎన్నికలకు ముందు సర్వేలైనా, పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోలైనా చెప్పింది ఒకటే. తమిళనాడులో డీఎంకేకి పోలింగ్ ఏకపక్షంగానే ఉంటుందని. ఏ సర్వే చెప్పినా డీఎంకే 172 సీట్లలో విజయం ఖాయమని జోస్యం చెప్పాయి. కానీ కౌంటింగ్ మొదలైన తర్వాత చూస్తే మెజారిటిలు మరీ ఏకపక్షంగా లేవని స్పష్టమైపోతోంది. 234 సీట్లలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 124 సీట్లలో మెజారిటిలో ఉంది. ఇదే సమయంలో పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే కూటమి అభ్యర్ధులు 96 సీట్లలో మెజారిటిలో ఉన్నారు.
ఈ రెండు కూటములనే తీసుకుంటే మెజారిటిలను బట్టిచూస్తుంటే గెలుపు కూడా అంత ఏకపక్షంగా సాధ్యమయ్యేట్లు లేదని తెలిసిపోతోంది. చాలాచోట్ల మంత్రులు వెనకబడే ఉన్నారు. పళనిస్వామి నాయకత్వంపై జనాల్లో అంతగా అసంతృప్తి లేదన్న విషయం అర్ధమవుతోంది. జయలలిత వారుసునిగా అధికారంలోకి వచ్చినా పళనిస్వామి మొదట్లో పాలనలో తడబడినా తర్వాత పుంజుకున్నారు. ఎలాగంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కి గట్టి దెబ్బ తగిలింది.
దాంతో వాస్తవాన్ని గ్రహించిన పళనిస్వామి వెంటనే పరిపాలనను, సంక్షేమపథకాల అమలును జోరెత్తించారు. అదేకాకుండా దాదాపు రు. 13 వేల కోట్ల రైతుల రుణాలను ఒకేసారి రద్దుచేశారు. ఇలాంటి మరికొన్ని సంక్షేమపథకాల అమలు కారణంగా సీఎంపై జనాల్లో పాజిటివ్ అభిప్రాయాలు మళ్ళీ పెరిగాయి. కాకపోతే ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ జోక్యం పెరిగిపోతోందనే అసంతృప్తి జనాల్లో బాగా పెరిగిపోయిందట. దీనికితోడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవటం కూడా అధికారపార్టీకి కాస్త మైనస్ అయ్యిందనే అభిప్రాయం కనబడుతోంది.
ఏదేమైనా ఎన్నికలు పళనిస్వామిని చూసే జరిగాయి కాబట్టి జనాలు పెద్ద సంఖ్యలోనే ఆదరించారని అర్ధమవుతోంది. ఈ కారణంగానే సర్వేలు, ఎగ్జిట్ పోల్లో వచ్చినట్లు డీఎంకేకి 172 సీట్లు వస్తాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కౌంటిగ్ లో వస్తున్న ఫలితాలను బట్టి చూస్తుంటే ఏఐఏడీఎంకే కూటమి అసెంబ్లీలో గట్టి ప్రతిపక్షంగానే ఉండేట్లుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates