బాబు ఆ యువ‌నేత‌ను ఎంపీ సీటుతో సైడ్ చేసేస్తున్నారే ?

పార్టీలో ఎవ‌రికి అయినా చెక్ పెట్టాలన్నా.. ఏ నేత‌ను అయినా సైడ్ చేయాల‌న్నా చంద్ర‌బాబు వేసే ఈక్వేష‌న్లు మామూలుగా ఉండ‌వు. ఈ విష‌యంలో చంద్ర‌బాబుకు చంద్ర‌బాబే సాటి. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ నేత‌ల వ‌ర‌కు ఎవ‌రి తోక ఎప్పుడు ? ఎలా క‌ట్ చేయాలో బాబుకే బాగా తెలుసు. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి పార్టీ ఇన్‌చార్జ్‌, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కిమిడి నాగార్జున‌కు చంద్ర‌బాబు ఎంపీ సీటుతో చెక్ పెట్టేస్తున్నార‌న్న ప్ర‌చారం స్థానికంగా జ‌రుగుతోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళికి చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని చీపురుప‌ల్లి సీటు ఇవ్వ‌గా ఆమె గెల‌వ‌డంతో పాటు మంత్రి అయ్యారు. అయితే నాన్‌లోక‌ల్ అయిన ఆ ఫ్యామిలీ పెత్త‌నం చీపురుప‌ల్లి టీడీపీ కేడ‌ర్ త‌ట్టుకోలేక‌పోయింది. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఆ ఫ్యామిలీకి సీటు ఇవ్వ‌కూడ‌ద‌ని కేడ‌ర్ ఎంత గ‌గ్గోలు పెట్టినా చంద్ర‌బాబు మాత్రం క‌ళా వెంక‌ట్రావును సంతృప్తి ప‌రిచేందుకు ఆయ‌న‌కు ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) సీటుతో పాటు మృణాళిని త‌న‌యుడు నాగార్జున‌కు చీపురుప‌ల్లి సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ ఓడిపోయారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కూడా చంద్ర‌బాబు నాగార్జున‌కు చీపురుప‌ల్లి పార్టీ ప‌గ్గాల‌తో పాటు ఏకంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్టీ ప‌గ్గాలు కూడా ఇచ్చారు. అయితే స్థానిక టీడీపీ కేడ‌ర్ నాగార్జును బ‌ల‌వంతంగా త‌మ‌పై రుద్ద‌వ‌ద్ద‌ని యేగాది కాలంగా గగ్గోలు పెడుతోంది. దీంతో చంద్ర‌బాబు అక్క‌డ బ‌లంగా ఉన్న బొత్స‌కు చెక్ పెట్టాలంటే ముందు పార్టీలో ఈ లోక‌ల్ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే నాగార్జున‌కు విజ‌య‌న‌గ‌రం ఎంపీ సీటు ఇచ్చి.. చీపురుప‌ల్లి ప‌గ్గాలు స్థానిక నేత‌ల‌కే ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య‌న‌గ‌రం ఎంపీగా పోటీ చేస్తోన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు. ఆయ‌న కుమార్తెకు ఎలాగూ విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే సీటు ఇస్తోన్న నేప‌థ్యంలో నాగార్జున‌ను విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటుకు పంపేసి.. ఆయ‌న‌కు చీపురుప‌ల్లి సీటు నుంచి త‌ప్పించేస్తార‌ని పార్టీ నేత‌లు కూడా చెపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చీపురుప‌ల్లిలో ఓడిపోయిన కిమిడి నాగార్జున ఈ సారి పార్ల‌మెంటుకు వెళితే అక్క‌డ ల‌క్ ఎలా ప‌రీక్షించుకుంటారో ? చూడాలి.