రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పదోతరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు పెదవి విప్పారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే.. తప్పేంటని ప్రశ్నించారు. అంతేకాదు.. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పి కొట్టారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం తాను ఆలోచిస్తాని సీఎం జగన్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు.
కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు వస్తుందని గుర్తుచేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి కోవిడ్ కల్లోలంలోనూ దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్న సీఎం.. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అయితే.. తాజాగా జగన్ చేసిన ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. వారి భవిష్యత్తు అంటే.. వారి ప్రాణాలు కావా? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ వైఖరి మొండి తనాన్ని మించిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయా లను వలంటీర్ల ద్వారా సేకరించి.. దాని ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచిస్తు న్నారు. ఎక్క డైనా.. ఏ రాష్ట్రంలో అయినా .. ఈ సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించా రు. అయినప్పటికీ జగన్ వైఖరిలో మాత్రం మార్పులేదని మరోసారి స్పష్టమైందని అంటున్నారు పరిశీలకులు.