సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు ఎందుకు చుల‌క‌న‌య్యారు? ఇదో పెద్ద చ‌ర్చ‌

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఒక చిత్ర‌మైన చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా జ‌రిగిన రెండు ప‌రిణామా లు… ఒక అరెస్టు.. నేప‌థ్యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు సెంట్రిక్‌గా ఈ చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం, అందు నా.. సీనియ‌ర్ల విష‌యం కావ‌డం అత్యంత ఆసక్తిగా మారింది. ప్ర‌స్తుతం టీడీపీ అంటే.. చంద్ర‌బాబు+లోకేష్ +సీనియ‌ర్లు(కురువృద్ధులు) అనే మాట స‌ర్వత్రా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ఎవ‌రికీ రెండో మాట కూడా లేదు. అయితే.. ఇప్పుడు పార్టీలో విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సీనియ‌ర్లకు చంద్ర‌బాబు ప‌ట్ల విలువ లేకుండా పోయింద‌నే టాక్ రావ‌డ‌మే గ‌మ‌నార్హం.

ఇది కొంత ఆశ్చ‌ర్యంగాను, చిత్రంగాను అనిపించినా.. నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో చాలా మంది సీనియ‌ర్లు.. ఆయ‌న‌ను న‌మ్ముకుని(అంటే.. టీడీపీ ప్ర‌భుత్వాన్ని) అనేక వ్యాపారాలు ప్రారంభించారు. దీనికి బాబు ఆదిలో స‌హ‌కారం అందించిన మాట వాస్త‌వం. కానీ.. లోకేష్ ఎంట‌ర్ కావ‌డంతో సీనియ‌ర్లకు కొన్ని కొన్ని విష‌యాల్లో చుక్కెదురైంది. దీంతో వారు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు మ‌ధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు అవి ముందుకు సాగ‌క‌.. వాళ్లంతా న‌ష్ట‌పోతున్నారు. ఇక‌, సీనియ‌ర్ల‌ను న‌మ్ముకుని.. మ‌రికొంద‌రు మాజీ నేత‌లు.. కూడా న‌ష్ట‌పోయారు.

ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌మండ్రి మాజీ ఎంపీ, న‌టుడు మాగంటి ముర‌ళీ మోహ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక‌.. రాజ‌ధాని ప్రాంతం అమ‌రావతిని దృష్టిలో ఉంచుకుని.. గుంటూరు జిల్లా తాడేప‌ల్లి స‌మీపంలోని కుంచ‌న‌ప‌ల్లి ప్రాంతంలో.10 ఎక‌రాల వ్య‌వ‌సాయ స్థలం కొన్నారు. వాస్త‌వానికి ఇది వ్య‌వ‌సాయ సాగు భూమి. అంటే.. ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌దు. ముఖ్యంగా నివాసాల‌కు అస‌లు వాడ‌కూడ‌దు. అయితే.. ఇలా వాడుకునేందుకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తెచ్చుకుని, ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ యాక్ట్ ప్ర‌కారం వ్య‌వ‌సాయేతర భూమిగా మార్చు కుంటే స‌రిపోతుంది.

మ‌రి ఈ విష‌యంలో ముర‌ళీమోహ‌న్‌కి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెద్ద దెబ్బ వేసేసింది. ఈ భూమిని వ్య‌వ‌సాయేత‌ర భూమిగా మార్చాలంటూ.. పెట్టుకున్న అర్జీని దాదాపు మూడు సంవత్స‌రాల పాటు తొక్కి పెట్టింది. దీనికి కార‌ణాలు ఏమిటో తెలియ‌దు. స‌రే.. ‘ప్ర‌భుత్వం మ‌న‌దే క‌దా!’ అనుకున్న మాగంటి ఆ భూమిలో భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు క‌ట్టేశారు. ఇక‌, ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చే వ‌ర‌కు ఈ భూమి తాలూకు వివాదాన్ని చంద్ర‌బాబు స‌ర్కారు ప‌రిష్క‌రించ‌లేదు.

జ‌గ‌న్ స‌ర్కారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే ముర‌ళీ మోహ‌న్‌కు నోటీసులు జారీ చేయ‌డ‌మే కాకుండా.. సుమారు రూ.2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఫైన్ విధించింది. దీంతో ఈ విష‌యంలో చేతులు కాలాయ‌ని భావించిన ముర‌ళీ మోహ‌న్‌.. ప్ర‌భుత్వం వేసిన ఫైన్ చెల్లించి చాలా సైలెంట్ అయిపోయారు. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం.. ఇలా అనేక మంది నేత‌లు ప్ర‌భుత్వంతో ఎదురు దెబ్బ‌లు తింటున్నారు.

తాజాగా సంగం డెయిరీ విష‌యంలో చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌ను అరెస్టు చేశారు. వాస్త‌వానికి ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏ లోపాల‌ను ఎత్తి చూపుతోందో… వాటిని స‌రిచేయాల‌ని ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కారు స‌మ‌యంలోనే విన్న‌వించుకున్నారు. కానీ, వాటిని బాబు స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ‌ త‌గిలింది. అదేవిధంగా ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘ‌వ‌రావు మైనింగ్ భూములు, అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి కేటాయించి త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ భూముల విష‌యంలోనూ చంద్ర‌బాబు అనుమ‌తులు మంజూరు చేయ‌డంలో తాత్సారం చేశారు. ఫ‌లితంగా శిద్దా పార్టీ మారిపోయారు. జేసీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ ప‌రిణామాలే.. ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. సీనియ‌ర్లు.. బాబును చుల‌క‌న‌గా మాట్లాడ‌డానికి, ఆయ‌న‌పై విశ్వ‌స‌నీయ‌త‌ను పోగొట్టుకునేందుకు ఇవే కార‌ణాలు గా చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)