రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. పార్టీలు ప్రజల్లో పెద్దగా బలం సంపాయించుకునేందుకు ప్రయత్నించినా.. చేయకపోయినా.. ప్రత్యర్థి పార్టీ చేసే తప్పలను తమకు అనుకూలగా మార్చుకుంటే.. చాలు అధికారంలోకి వచ్చేందుకు దారి ఏర్పడుతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కూడా ఈ లోపాలను తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగారు. తనను విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నిలువరించ డం.. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, తనపై కోడికత్తి దాడి జరగడం, తన పార్టీ నేతలు.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటివారిని అరెస్టు చేయడం వంటివి పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.,
ఆయా అంశాలతోనే ప్రజల్లోకి వెళ్లారు. విజయం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు టీడీపీ కూడా ఇదే ప్లాన్ చేస్తోంది. ఇదే సూత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. జగన్ ప్రబుత్వం దూకుడును ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు.. తమ పార్టీ నేతలపై జగన్ రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున ప్రజలను కదిలించేలా పక్కా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు సీనియర్ నేతలు చూచాయగా చెబుతున్నారు. ఇతరత్రా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. దక్షిణాదిలో మాత్రం.. నేతలను నేతలు విమర్శించుకోవడం వరకు.. ప్రజలు సహిస్తారు. ఒకరిపై ఒకరు తిట్ల దండకం వినిపించుకున్నా.. ఎంజాయ్ చేస్తారు.
కానీ, రాజకీయ కక్షలతో అరెస్టులు చేస్తే.. మాత్రం ప్రజలు అస్సలు సహించరు., ఏ పార్టీ అయినా.. మరో పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని జైల్లో పెట్టడాన్ని.. దక్షిణాది ప్రజలు ఇష్టపడరు. “రాజకీయంగా విమర్శించుకోండి. కానీ.. జైళ్లలో పెట్టుకోవడం, అరెస్టులు చేయడం మంచిది కాదు. ప్రజాస్వామ్యం అనిపించుకోదు” అని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతుంటారు. తమిళనాడులో ఇదే అధికారాన్ని మార్చేసింది. గతంలో జయలలిత ను అరెస్టు చేసినప్పుడు ప్రజాబాంధవుడు అయినప్పటికీ.. కరుణానిధిని గద్దె దింపేశారు. ఇక, కరుణను వేధించినప్పడు.. జయను కూడా ఇలానే చేశారు.
ఇక్కడ కూడా అదే ఫార్ములా పనిచేస్తుందని.. చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రస్తుతం తమ నేతలను జగన్ ప్రభుత్వం టార్చర్ పెడుతోందని, లేనిపోని కేసులతో అరెస్టులు చేస్తూ.. జైల్లో పెడుతోందని.. ఆయన సింపతీరాగం అందుకున్నారు. దీనినే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. “ఎన్ని అరెస్టులు జరిగితే.. అంత మాకే మంచిది” అని .. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా వ్యాఖ్యానించడాన్ని బట్టి.. వ్యూహం మారుతోందనే వాదన బలపడుతోంది. మరి జగన్ తప్పులపై ప్రజలు ఆగ్రహించి.. తమకు అధికారం అప్పగించడం ఖాయమని అనుకుంటున్న టీడీపీ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates