ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం

ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు ఎండీ కమ్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. గడిచిన కొద్ది రోజులుగా అపోలోలో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలే ఆమె మరణానికి కారణంగా చెబుతున్నారు. ఈ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాసను విడిచినట్లుగా తెలుస్తోంది. ఏబీఎన్ఆంధ్రజ్యోతి సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న వేమూరి కనకదుర్గ (63) మరణం షాకింగ్ గా మారింది.

సంస్థకు దన్నుగా నిలవటంతో పాటు.. ఆర్థిక అంశాల విషయంలో ఆమె కీలక భూమిక పోషిస్తారని చెబుతారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించటానికి ముందు కూడా ఆమె.. రోజువారీగా సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాల విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని చెబుతారు. ఇప్పటికి ఎవరైనా కొత్త రిక్రూట్ మెంట్ కు ఆమె ఆమోదం లభించాల్సి ఉంటుందని చెబుతారు. సంస్థకు ఎంతో కీలకంగా ఉన్న ఆమె లేని లోటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు.. వ్యక్తిగతంగా ఆర్కేకు భారీ లోటుగా చెప్పక తప్పదు.

కనకదుర్గ మృతికి పలువురు రాజకీయ.. సినీ రంగాలకు చెందిన ప్రముఖులు.. వివిధ వర్గాలకు చెందిన వారు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగుల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విషాదంలో ఉన్న సంస్థ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు. దీనికి కొద్ది రోజులు ముందు.. కనకదుర్గ సోదరుడి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించటం తెలిసిందే. నెల రోజులు కూడా కాకముందే చోటు చేసుకున్న రెండు విషాద ఉదంతాలు ఆంధ్రజ్యోతి సంస్థల్లో విషాదాన్ని నింపుతున్నాయి.