బెజవాడ రాజకీయాల్లో తనకంటూ.. ఒక గుర్తింపు పొందారు.. కమ్యూనిస్టు నాయకుడు.. మాజీ కార్పొరేటర్.. చిగురుపాటి బాబూరావు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఒకప్పటి తరం కామ్రేడ్లతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌గా కూడా నాలుగు సార్లు.. గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనిచేశారు. విజయవాడ పై పట్టుతోపాటు.. కార్పొరేషన్ వ్యవహారాలపై మంచి అనుభవం ఉన్న నాయకుడిగా బాబూరావుకు పేరుంది.
ప్రస్తుతం కామ్రెడ్ ఉద్యమాలకు కేంద్రమైన విజయవాడలో కమ్యూనిస్టుల పరిస్ధితి దాదాపు కొడిగట్టింది. గత రెండు ఎన్నికల్లోనూ సీపీఎం తరఫున బాబూ రావు.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే.. ఈ రెండు సార్లు కూడా ఆయన ఘోరపరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. నిజానికి 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగారు. ఈ క్రమంలోనే జనసేన కూడా బాబూరావుకు మద్దతిచ్చింది. అయినప్పటికీ.. డిపాజిట్ దక్కించుకోలేక పోయారు.
వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరే ఉన్నా కమ్యూనిస్టుల కాలం చెల్లిన విధానాలకు తోడు.. బెజవాడలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పూర్తిగా కనుమరుగు అయిపోతుండడం ఆయనకు మైనస్ అయ్యింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి కామ్రెడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో చట్ట సభల్లో తన వాణి వినిపించాలన్న బాబూరావు ఆశలు నెరవేరే పరిస్థితి లేదు.
మూడున్నర దశాబ్దాలుగా బెజవాడ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన పోరాటాలతో తనదైన ముద్రవేసిన చిగురుపాటి బాబూరావు పరిస్థితి ఇక పేరుకే అన్న విధంగా మారిపోయింది. కానీ, ఆయన గడిచిన 15 సంవత్సరాలుగా.. తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని.. అధ్యక్షా అంటూ.. గళం విప్పాలని కలలు కంటున్నారు. కానీ, ఆ ఆశలు ఎప్పటకీ తీరేలా లేవని అంటున్నారు పరిశీలకులు.