‘పంప‌కాల‌’ క‌ల‌వ‌రం.. బాబుకు సెగ పెడుతుందా ?


టీడీపీలో స‌రికొత్త విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌మ్ముళ్లు ఈ విష‌యాన్ని త‌లుచుకుని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు కూడా..! ఆ విష‌యం ఏంటి అంటారా ? అదే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేసింది. అయితే.. ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఒక విష‌యం మాత్రం త‌మ్ముళ్ల‌కు పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా స్ప‌ష్టంగా తెలిసింది. అదేంటంటే.. పార్టీ ఓడిపోయింది.. కానీ.. ప్ర‌జ‌లు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌ల‌కు వ‌చ్చారు. దీని వెనుక వారు పంచిన డ‌బ్బులు ప‌నిచేశాయి. వైసీపీ నేత‌లు ఓటుకు ఇంత‌ని పంచితే.. టీడీపీ నేత‌లు సైతం.. అంతో ఇంతో పంచారు. అందుకే.. క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్ల‌యినా.. వారికి ల‌భించాయి.

ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. మాత్రం సీన్ రివ‌ర్స్అయిపోయింది. టీడీపీ ఎన్నిక‌ల‌ను బాయ్ కాట్ చేసింది. చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే.. స్థానికంగా నేత‌లు మాత్రం ప‌ట్టు స‌డ‌ల‌కుండా.. పోటీకి సై అన్నారు. పోటీకి రంగంంలోకి దిగారు.. అయితే.. అధ్య‌క్షుడు చంద్ర‌బాబే ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన త‌ర్వాత‌.. స్థానికంగా నేత‌ల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బు పంప‌కాలు జ‌ర‌గ‌లేదు. ఫ‌లితంగా ఓట్లు వేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. మొత్తంగా స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓటు బ్యాంకుకు, ప‌రిష‌త్‌లో వ‌చ్చిన ఓటు బ్యాంకుకు చాలా తేడా క‌నిపించింది.

ఈ విష‌యంపై టీడీపీలో పెద్ద ఎత్తున స‌మాలోచ‌న‌లు జ‌రిగాయి. మొత్తంగా తేల్చింది ఏంటంటే.. ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంచ‌క త‌ప్ప‌ద‌ని…! ఇదే ఇప్పుడు టీడీపీని క‌ల‌వ‌ర పెడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచ‌క‌పోతే.. ఎవ‌రూ ఓటు వేసేందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని.. దీనికి సంబంధించి నాయ‌కులు రెడీ అవ్వాల్సిందేన‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. పార్టీలో అంద‌రి నేత‌ల మ‌ధ్య ఇప్పుడు ఇదే చ‌ర్చ న‌డుస్తోంది.

అయితే.. ఇప్పుడు అధికార పార్టీ ఆర్థికంగా బ‌లంగా ఉంది. ఒక‌వైపు సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేస్తూ.. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేందుకు కూడా రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని బ‌లంగా డీ కొట్టాలంటే.. అంత‌కు మించి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించాల్సిన అవ‌స‌రం టీడీపీకి ఉంది. మ‌రి ఇంత మొత్తం నిధులు ఎవ‌రు ఇస్తారు? ఎలా వ‌స్తాయి? చంద్ర‌బాబు స‌ర్దుబాటు చేయ‌క‌పోతే.. ఎలా ..? మ‌ళ్లీ ఓట‌మేనా? అని నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. చంద్ర‌బాబు గ‌తంలోలా డ‌బ్బు స‌ర్దుబాటు చేయ‌ట్లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా పార్టీ నేత‌ల్లో ఎక్కువుగా వినిపిస్తున్నాయి.