తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో మరోసారి వలంటీర్లదే.. హవా కనిపిస్తోంది. పైకి మాత్రం వలంటీర్లకు పోలింగ్‌కు సంబంధం ఏంటని మంత్రుల నుంచి నేతల వరకు ఎదురు ప్రశ్నలు సంధించారు. కానీ, ఎప్పటికప్పుడు.. ఏ ఎన్నికలు వచ్చినా వలంటీర్లదే ప్రధాన పాత్ర కనిపిస్తోంది. ఓటర్లను ప్రభావితం చేయ డంతోపాటు.. ప్రభుత్వ పథకాల విషయంలో వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారనేది ప్రధానంగా వలంటీర్లపై వస్తున్న విమర్శలు. సో.. మొత్తానికి చూస్తే.. తిరుపతి ఉప పోరులోనూ.. వలంటీర్లదే అంతా.. అన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం చవటపాళెం, గిరిజన కాలనీ, ఎరుకల కాలనీ, బేల్దారి కాలనీ, అడివయ్య కాలనీలల్లో సగం మందికి ఓటరు స్లిప్పులు అందలేదు. ఆ స్లిప్స్ అన్నీ వాలంటీర్ల ఇళ్ళల్లో ఉన్నట్లు ప్రతిపక్షాల నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఓటర్లు.. వాలంటీర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచీ నెల్లూరు జిల్లా వాలంటీర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కొందరు వాలంటీర్లు దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓట్లేయిస్తుండగా.. మరికొందరు ఓటర్ల స్పిప్స్ తీసేసుకుని ఇళ్లలో దాచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే వాలంటీర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో చిత్తూరు జిల్లాలో వరుస ఫిర్యాదులతో పది మందిని తొలగించినట్లు ఎన్నికల అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు. ఇక్కడ మంత్రి అనిల్ కుమార్ ప్రభావం ఎక్కువగా ఉందని టీడీపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీలోను, వైసీపీకే ఓటేయాలంటూ.. ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడం గమనార్హం. అయితే.. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషన్.. వలంటీర్ల విషయంపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.