మహా వినాయకుడు – ఒక్క అడుగు మాత్రమే !

హైదరాబాదులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేకత ఉంది. సుమారు 60 అడుగుల ఎత్తుతో కొలువు దీరి అందరి విఘ్నాలు పోగొట్టే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకే కరోనా విఘ్నం ఏర్పడింది. 1954 తర్వాత మొదటి సారి ఉత్సవాలపై సందేహాలు ఏర్పడ్డాయి.

కరోనా ఇపుడపుడే వదిలే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి వీడియో కాన్ఫరెన్సులో ఆగస్టు కల్లా వ్యాక్సిన్ కనిపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే… వ్యాక్సిన్ కనిపెట్టడం ఎంత ముఖ్యమో అది 130 కోట్ల భారతీయులకు అవసరమైనంత తయారుచేయడం కూడా అంతే ముఖ్యం. అయితే ఆగస్టులో వినాయక ఉత్సవాలుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను భారీ సంఖ్యలో గుమిగూడటాన్ని ప్రభుత్వం వినాయకచవితికి కూడా అనుమతించదు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్రపూజ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్సవ కమిటీ విగ్రహం ఎత్తు ఒక్క అడుగుకు పరిమితం చేసినట్లు పేర్కొంది.

మరో వైపు కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఇది పీక్స్ కి చేరి తగ్గుముఖం పట్టేదెన్నడో అర్థం కాని పరిస్థితి. అందుకే ఈ ఏడాది కేవలం ఒక్క అడుగు వినాయకుడిని ప్రతిష్టించాలని భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఒకవేళ ఆగస్టుకు కరోనా ప్రభావం బాగా నెమ్మదించిన ఇప్పటిలా పెద్ద సంఖ్యలో జనం గుంపులుగుంపులుగా హాజరవడానికి అనుమతించరు.