లోకేష్ చుట్టూ టీడీపీ రాజ‌కీయం.. ఏం జ‌రుగుతుంది ?

నారా లోకేష్‌. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు. ఈ రెండు డిగ్రీల‌ను ప‌క్క‌న పెడితే.. లోకేష్ కు ఉన్న ప్రాధాన్యం ఏంటి ? ఆయ‌న వ‌ల్ల పార్టీకి జ‌రుగుతున్న మేలేంటి ? ఆయ‌న్ను ఎన్ని రోజులు చంద్ర‌బాబు సాకుతారు ? ఆయ‌న్ను న‌మ్ముకుని రాజ‌కీయం చేస్తే భ‌విష్య‌త్తు ఉంటుందా ? ఇదేదో.. వైసీపీలోనో.. టీడీపీ అంటే గిట్ట‌ని వారి నుంచో వ‌చ్చిన ప్ర‌శ్న‌లు కానేకావు. త‌ల‌పండిన టీడీపీ మేధావుల మ‌ధ్య సాగుతున్న గుస‌గుస‌!! న‌మ్మినా న‌మ్మ‌క పోయినా.. ఇది మాత్రం నిజం. ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు చేసిన సంచ‌ల‌న కామెంట్ల ద‌రిమిలా.. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు లోకేష్ విష‌యం పార్టీలో ప్ర‌ధాన ప్ర‌స్తావ‌నాంశంగా మారింది.

నిజానికి అచ్చెన్నాయుడు తాను చేసిన కామెంట్లు కావ‌ని త‌ర్వాత చెప్పుకొన్నారు.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, పార్టీలోని సీనియ‌ర్లు మాత్రం ఎక్క‌డా అచ్చెన్న‌ను త‌ప్పు ప‌ట్ట‌క‌పోవ‌డంతోపాటు.. లోకేష్ విష‌యాన్ని ప్ర‌ధానంగా చేసుకుని చ‌ర్చించ‌డం.. గ‌మ‌నార్హం. “పార్టీలో 40 ఏళ్లుగా ఉన్నాను… ఓ చిన్న ప‌ద‌విని పొందాలంటే.. ఎన్ని మెట్లు ఎక్కాలో మాకు తెలుసు.. మ‌రి అలాంటిది లోకేష్‌కు జాతీయ‌ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇచ్చారంటే.. ఆయ‌న సీనియ‌ర్రే!!”- అని తూర్పు గోదావ‌రి కి చెందిన ఓ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు ఆఫ్ ది రికార్డుగా మీడియా ముందుకు వ్యాఖ్యానించిన తీరు లోకేష్‌పై పార్టీ నేత‌ల్లో ఉన్న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

ఆయ‌న ఒక్క‌రే అనుకుంటే పొర‌పాటే.. చాలా మంది సీమ నేత‌లు కూడా లోకేష్ విష‌యంలో ఇలానే ఆలోచ‌న చేస్తున్నారు. “చంద్ర‌బాబు ఉన్నంత వ‌ర‌కు మాకు ఫ‌ర్వాలేదు” అని సీమ‌కు చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు అన్నాడు. అంటే.. దీనిని బ‌ట్టి.. బాబు త‌ర్వాత‌.. ఏంటి ? అనే విష‌యాన్ని సీనియ‌ర్లు కూడా డిసైడ్ చేసుకోలేక పోతున్నారు. ఇవ‌న్నీ ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. రావడంతో నే మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన లోకేష్ .. కొంద‌రు సీనియ‌ర్ల‌పై పెత్త‌నం చేశార‌నేది నిర్వివాదాంశం. అయితే..గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచి ఉంటే.. కొంత వ‌ర‌కు స‌త్తా ఉంద‌ని చెప్పుకొనేందుకు అవ‌కాశం ఉండేది. కానీ, ఆయ‌న ఓడిపోయారు.

అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రి మాటా వినిపించుకోక‌పోవ‌డం.. ఎవ‌రు ఏం చేసినా.. ప‌ట్టించుకోక‌పోవ‌డం.. వంటివి ఇప్పుడు లోకేష్‌కు ప్ర‌ధాన అవ‌రోధాలుగా మారాయి. త‌న‌కు సంబంధం లేద‌ని వివేకా హ‌త్య కేసులో ప్ర‌మాణాలు చేయ‌డాన్ని రాజ‌కీయ స్టంటుగా వైసీపీ నేత‌లు అన‌డం కాదు.. పార్టీలోని సీనియ‌ర్లు సైతం చాటుమాటుగా దెప్పిపొడుస్తున్నారు. ఇక‌, త‌న స్థాయిని మ‌రిచి చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా లోకేష్‌కు మైన‌స్‌గా మారుతున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. లోకేష్ చాలా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది సీనియ‌ర్ల మాట‌.