టీడీపీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయనే విషయాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన ప్రాయంగా చెప్పేశారు. త్వరలోనే అంటే.. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నిక ముగియగానే.. కష్ట పడుతున్న.. పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని వెతికి పట్టుకుని మరీ.. ప్రాధాన్యం ఇస్తానని.. వారికి అండగా ఉంటానని ఆయన తాజాగా ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో భారీ మార్పులు ఖాయమనే వాదన తమ్ముళ్లలో చర్చకు వస్తోంది.
మరి ఏం జరుగుతుంది? నిజానికి 2019 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత టీడీపీలో పెను మార్పులు తీసుకు వస్తానంటూ.. చంద్రబాబు.. అనేక మందికి పదవులు ఇచ్చారు. పార్లమెంటరీ స్థాయి పదవుల నుంచి మండలాల వారీగా కూడా పదవులు కేటాయించారు. అందరికీ పదవులు అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరికీ పదవులు పంచారు. అయినప్పటికీ.. తాజాగా జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పార్టీని పూర్తిగా డీలా పడేలా చేసింది. ఈ ఎఫెక్ట్ తిరుపతిపై కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఆయన సంచలన ప్రకటన చేశారు.
అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని పునరుజ్జీవింపజేయాలంటే.. సీఎం జగన్ బాటలో నడవడం తప్ప చంద్రబాబు ముందు మరో ఆప్షన్ లేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యం గమనిస్తే.. పార్టీలో సీనియర్లకే ఎక్కువగా ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. వారంతా ఔట్ డేటెడ్ అయిపోయారు. ఎక్కడా కూడా కొత్త మొఖాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు.. వరుసగా ఓటములు చవిచూస్తున్నవారికే పదవులు కట్టబెట్టారు. కానీ, వైసీపీని తీసుకుంటే.. నేత ఎవరనేది కాదు.. నాయకుడిని బట్టి.. పార్టీ ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు.
ఇప్పుడు ఇదే సూత్రం ఆధారంగా పార్టీని బలోపేతం చేయాలంటే.. ఎవరు ఏ మూల జెండా పట్టుకున్నా.. అతి తక్కువ సమయంలో ఆర్థిక, సామాజిక వర్గాల ఆధారంగా కాకుండా పనితీరును బట్టి.. ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలు పంపించడం తక్షణావసరమనే వాదన టీడీపీలోనూ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ ఇంజనీరింగ్ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని.. ఇది తిరుపతి ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి కొంత ఆధారపడినా.. మొత్తంగా అయితే.. సమూల మార్పులు ఉంటాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.