షర్మిల దీక్ష సక్సెస్సా ? ఫెయిలా ?

ఇప్పుడిదే విషయం చాలామందికి అర్ధం కావటంలేదు. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల 72 గంటల పాటు ఇందిరాపార్కు దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ తదితర సమస్యల నేపధ్యంలో పోలీసులు కేవలం గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకే అనుమతించారు. సరే షర్మిల కూడా అనుమతి ప్రకారమే ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్షచేశారు. వ్యక్తిగతంగా చూస్తే షర్మిల దీక్ష ఓకేనే.

కానీ ఆమె ఆశించినట్లు తెలంగాణాలోని వివిధ వర్గాల నుండి మద్దతు పెద్దగా వచ్చినట్లు కనబడలేదు. తన దీక్షకు మద్దతు ఇవ్వాలని, తనతో పాటు దీక్షలో కూర్చోవాలని ఆహ్వానిస్తు షర్మిల పేరు పేరునా చాలామందికి లేఖలు రాశారు. లేఖలు అందుకున్న వారిలో బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాత్రమే షర్మిలకు మద్దతుగా వేదిక దగ్గర కనిపించారు.

మరి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాగాయకుడు గద్దర్, ప్రజాసంఘాల నేతలు ఎవరు కూడా మద్దతుగా నిలిచినట్లు లేదు. ఒకవైపేమో వీళ్ళంతా కేసీయార్ ప్రభుత్వాన్ని నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. మరి ఇదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల చేసిన దీక్షకు వీళ్ళంతా ఎందుకు గైర్హాజరయ్యారు ? ఆహ్వానం లేదు కాబట్టి రాలేదని అనుకునేందుకు కూడా లేదు. ముందుగానే షర్మిల వీళ్ళందరికీ ఆహ్వానాలు పంపారు.

ఆహ్వనాలు అందినా మద్దతుగా వేదిక దగ్గరకు రాలేదంటే షర్మిలను సీమాంధ్ర వ్యక్తిగానే వీళ్ళంతా పరిగణిస్తున్నారా ? సీమాంధ్ర వ్యక్తితో చేతులు కలపటం ఇష్టంలేకే వీరంతా ఆమెకు దూరంగా ఉన్నారా అనే డౌటు పెరిగిపోతోంది. ఏదేమైనా, ఎవరేమనుకున్నా తాను అనుకున్న ప్రకారం షర్మిల అయితే ఇందిరాపార్కు దగ్గర దీక్ష చేశారు. మరింతకీ షర్మిల దీక్ష సక్సెస్ అయినట్లా ? లేకపోతే ఫెయిలయ్యిందా ? అన్నదే అర్ధంకాలేదు.