తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ లక్ష్యంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు వైసీపీ టార్గెట్ ఇక్కడ 5 లక్షల ఓట్లని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పార్టీ నేతలకు, మంత్రులకు 5 లక్షల టార్గెట్ విధించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనగా.. మరో వంద మంది ఎమ్మెల్యేలు.. పరోక్షంగా ప్రచార పర్వంలో ప్రధాన భూమిక వహించారు.
అయితే.. తాజాగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. 5 లక్షల మెజారిటీ తమకు పెద్ద విషయం కాదని వ్యాఖ్యా నించారు. ఓటింగ్ పెరిగితే.. తమకు 6 లక్షల నుంచి ఆరున్నర లక్షల వరకు ఓట్లు వేస్తారని చెప్పుకొచ్చారు. తమ రెండేళ్ల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పుకొచ్చిన ఆయన.. ప్రచార పర్వం ఘనంగా సాగిందని.. ఎక్కడా తాము ఎవరినీ ప్రలోభాలకు గురి చేయలేదని, అలాంటి అవసరం కూడా తమకు లేదని చెప్పుకొచ్చారు. ఇక, చంద్రబాబు సభపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. రాళ్లు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
అదేవిధంగా చంద్రబాబు చిత్తూరు జిల్లా సత్యవేడులో నిర్వహించిన సభలో బుధవారం కరెంట్ కట్ చేశారనే వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఆ సంస్కృతి తమకు లేదని.. ఆధారాలు ఉంటే సమర్పించాలని.. చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోముఖ్యమైన అంశం.. వలంటీర్లను ఎన్నికల విధుల కోసం వినియోగించుకుంటున్నారనే ఆరోపణలపై స్పందించిన మంత్రి… ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న వలంటీర్లను వినియోగించాల్సిన అవసరం కూడా తమకు లేదని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ ప్రశ్నలకు సమాధానం ఏదీ?
అయితే.. మంత్రి పెద్దిరెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేయడం గమనార్హం. వీటిలో ప్రధానంగా ఇటీవల తిరుపతి ప్రజలకు సీఎం జగన్ రాసిన లేఖలను వలంటీర్లు ఎందుకు పంచిపెట్టారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. వెళ్లి వారినే అడగాలని అన్నారు.
- వైసీపీ అభ్యర్థి గురుమూర్తి.. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికాడన్న బీజేపీ నేతల ఆరోపణలను ఆయన తోసి పుచ్చినా.. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఆయన చూపించలేక పోయారు.
- వైసీపీ నేతలు .. డబ్బులు పంచేందుకు రెడీ అవుతున్నారనే వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించలేదు.
- ఇసుక దొరక్క గరుడ వారధి నిలిచిపోయిందనే వాదన కు కూడా పెద్దిరెడ్డి సమాధానం దాట వేయడం గమనార్హం.