తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఎన్నికల నోటి ఫికేషన్‌కు ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతోపాటు.. ఇప్పుడు ప్రచారాన్ని కూడా ఉధృతం చేసింది. అయితే.. ఒకవైపు ప్రచారంతోను.. మరోవైపు అధికార పార్టీలోని లోపాలను కూడా తనకు ప్లస్‌లుగా మార్చుకుని.. ముందుకు సాగుతోంది.. టీడీపీ. సీఎం జగన్ ముందుకు ఇక్కడ ప్రచారానికి వస్తానని చెప్పి.. తర్వాత కరోనా పేరుతో వెనుకడుగు వేశారు. దీనిని చంద్రబాబు ఎత్తి చూపుతున్నారు. కరోనా నిజమే అయితే.. వలంటీర్లతో వేలాది మందిని పోగేసి .. సత్కారాలు ఎలా చేశారంటూ.. ఆయన ప్రశ్నించారు.
అదే సమయంలో వైఎస్ వివాకా హత్య కేసును పనరిశోధించడంలోను, నిందితులను పట్టుకోలేక పోవడాన్ని కూడా చంద్రబాబు.. తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ.. పైకి కనిపిస్తున్నవి. కానీ, కనిపించని ప్లస్‌లు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు ఆశించి చాలామంది నేతలు భంగపడ్డారు. వారంతా ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో వీరంతా పార్టీ కోసం పనిచేయడం లేదనేది వాస్తవం. ఇది.. టీడీపీకి ప్లస్‌గా మారింది.
ఇక ప్రచారంలో కూడా మంత్రులు ఉంటేనే నాయకులు కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్న చోట కీలక నేతలు ముందుకు సాగడం లేదు. దీంతో వైసీపీ అంతర్గత కలహాలు.. టీడీపీకి మేలు చేస్తాయని ఆ పార్టీ కీలక నేతలు అంచనా వేస్తున్నారు. ఇక, అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించడంతో.. ప్రజలకు పెద్దగా తెలియని ఆయనకు ఓట్లు వేస్తారా? అనేది కూడా టీడీపీకి కలిసివస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరుకు చెందిన సీనియర్ నాయకురాలు కావడం.. చాలాకాలంగా రాజకీయాల్లో ఉండటం టీడీపీకి ప్లస్ పాయింట్‌గా మారింది.
ఇక, వైసీపీ నుంచి ఎవరూ పెద్దగా కీలక నేతలు రంగంలోకి రాలేదు. ఇక్కడ బాధ్యతలు అప్పగించిన మంత్రులే ప్రచారం చేస్తున్నారు. వీరిలో కూడా కొందరు డుమ్మా కొట్టేస్తున్నారు. కానీ… టీడీపీ నుంచి ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగడం మరింత ప్లస్‌గా మారింది. లోకేష్ కూడా అక్కడే మకాం వేసి మరి ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో నెలకొన్న వ్యతిరేక పరిణామాలు తమకు అనుకూలంగా మారతాయని.. టీడీపీ నేతలు అంచనా వేస్తుండడం గమనార్హం. మరి ఏమేరకు వీరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.