వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచనాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బట్టే.. ఒక లెక్కకు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడైనా.. ఈ తరహా పరిస్థితి తప్పిందంటే.. కష్టమే! ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. అధికార వైసీపీలో కనిపిస్తోంది. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ నేతలు.. తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక అనగానే.. అప్పటి పరిస్థితిలో అంటే.. నెల కిందటి పరిస్థితిలో సీఎం జగన్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ గెలుపు ముఖ్యం కాదని.. ఐదు లక్షల మెజారిటీ సాధించాలని లక్ష్మణ రేఖ గీశారు. అంతేకాదు, ఈ బాధ్యతను కీలక మంద్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి అనిల్పైనే మోపారు. నిజానికి ముందు ఈ మంత్రులు.. కూడా ఈ టార్గెట్ను లైట్ తీసుకున్నారు. ఆ.. ఇదెంత అనుకున్నారు. వాస్తవానికి అప్పటి పరిస్థితిని బట్టి.. ఈ మాత్రం మెజారిటీ సాధ్యమేనని అనుకున్నారు.కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిణామాలు మారుతుండడం.. వాస్తవాలు కళ్లముందుకు వస్తుండడంతో సీనియర్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఐదు లక్షల మెజారిటీ సాధన సాధ్యమేనా? అనే సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అంచనాలు దక్కకపోవడానికి కారణాలు ఇవే..
- అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి రాజకీయాలకు కొత్త కావడం
- గురుమూర్తికి-తిరుపతికి మధ్య సంబంధాలు లేకపోవడం
- వైసీపీపై సానుభూతి పవనాలు.. గతంలో కంటే తక్కువగా ఉండడం
- రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కొందరికే దక్కుతుండడం
- సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉన్న రాజకీయ వాతావరణం.. మిగిలిన జిల్లాల్లో లేక పోవడం
- కడపలో వచ్చిన మెజారిటీని ఇక్కడ సాధించేందుకు అవకాశాలు లేకపోవడం
- హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు
- తిరుపతిలో వైసీపీ చనిపోయిన సిట్టింగ్ ఎంపీకి చాన్సివ్వలేదు.(దీనిని టీడీపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది)
- ప్రతిపక్షాలకు స్థానికంలో తీవ్ర ఎదురు దెబ్బతగిలిన నేపథ్యంలో వాటిని వైసీపీ తక్కువగా అంచనా వేయడం
- ప్రత్యేక హోదా విషయాన్ని ప్రతిపక్షాలు జోరుగా ప్రచారం చేస్తుండడం
- తాజాగా బీజేపీ నేతలు అవినీతి అంటూ.. జగన్పై వ్యతిరేక ప్రచారానికి దిగడం
…. ఇలా.. అనేక కారణాలు.. ఇప్పుడు వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారాయి. గెలుపు సాధ్యమే అయినా.. వారు అనుకున్న, లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మెజారిటీ సాధించలేక పోతే.. ఇబ్బందే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.