క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికి ఇదే అభిప్రయాం కలుగుతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక్కసారిగా ప్రతిపక్షాలు అధికారపార్టీ అభ్యర్ధిపై ఆరోపణల దాడులను పెంచేశాయి. నిజానికి ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలను అమలుచేస్తోంది. వాటిల్లో ఏమైనా లోటుపాట్లు, అవినీతి, అక్రమాలుంటే ప్రతిపక్షాలు వాటిని టార్గెట్ చేసుకోవాలి. అయితే విచిత్రంగా వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తిని టార్గెట్ చేస్తున్నాయి.
వ్యక్తిగతంగా జగన్ కు సేవచేసిన కారణంగా డాక్టర్ గురుమూర్తి అసలు పోటీకే అనర్హుడంటూ బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. గురుమూర్తి ఎస్సీనే కాదని కొందరు, క్రిస్తియన్ అని మరికొందరు బీజేపీ నేతలు గోలచేస్తున్నారు. మరికొందరైతే గురుమూర్తి నిజంగానే హిందువైతే ఇంతవరకు తిరుమల శ్రీవారిని ఎందుకు దర్శించుకోలేదని కూడా ప్రశ్నించేశారు. అసలు ఉపఎన్నికలకు, గురుమూర్తి తిరుమల దర్శనానికి ఏమి సంబంధమో బీజేపీ నేతలే చెప్పాలి.
ఇక టీడీపీ నేతలైతే మరింత విచిత్రమైన ఆరోపణలు మొదలుపెట్టారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఫిజియోథెరపిస్టుగా గురుమూర్తి సేవలందించిన విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ కాలుకు గురుమూర్తి వైద్యం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటినిపట్టుకుని ఇపుడు జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదుచేయాలని సీనియర్ తమ్ముడు వర్లరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జగన్ కాలుకు గురుమూర్తి వైద్యం చేసిన ఫొటోలను వైసీపీయే సోషల్ మీడియాకు రిలీజ్ చేసిందట. దానివల్ల ఎస్సీ జాతికంతా జగన్ వల్ల అవమానం జరిగిందని వర్లంటున్నారు. వైద్యం చేసేవాళ్ళకు, చేయించుకునేవాళ్ళకు మధ్య డాక్టర్-రోగి సంబంధమే ఉంటుంది. అలా కాకుండా సామాజికవర్గాల కోణంలో చూస్తే ఇక ఎవరికి ఎవరు వైద్యం చేయలేరు, ఎవరు వైద్యం చేయించుకోలేరు.
తిరుమల దర్శనం, జగన్ కు గురుమూర్తి సేవలు చేయటం, వైసీపీ అభ్యర్ధి హిందువేనా ? ఎస్సీ జాతిని జగన్ అవమానించారు…ఇలాంటి అంశలనే ప్రతిపక్షాలు పదే పదే ప్రచారం చేస్తున్నాయంటే ఏమిటర్ధం ? ఏమిటంటే అభ్యర్ధిపై ఆరోపణలు చేయటానికి, విమర్శించటానికి ప్రతిపక్షాల దగ్గర అస్త్రాలు ఏమీలేవనే. ప్రభుత్వపరంగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటానికి ఏమీలేదు కాబట్టే ఇలాంటి సిల్లీ అంశాలతో కాలక్షేపం చేస్తున్నాయి. అంటే పోలింగ్ కు ముందే ప్రతిపక్షాలు చేతులెత్తేసినట్లే అనుకోవాలి.