రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవ్వరూ ఊహించలేరు. అప్పటి వరకు కింగ్‌లుగా ఉన్నోళ్లు వెంటనే జీరోలవుతారు. జీరోలుగా ఉన్నోళ్లు హీరోలు అవుతారు. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల పాటు రాజకీయాలు చేసి.. మంత్రిగా కూడా పేరున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పరిస్థితి ఇప్పుడు వైసీపీలో కుడితిలో పడిన ఎలుక పిల్ల మాదిరిగా మారింది. జమ్మలమడుగు టీడీపీ రాజకీయాలను సుధీర్ఘకాలం శాసించిన ఆయన 2004 నుంచి గత ఎన్నికల వరకు వరుసగా నాలుగు సార్లు ఓడిపోతూ వచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన వైసీపీలో చేరిపోయారు. రెండు దశాబ్దాల పాటు ఆయన ఎవరిమీద అయితే పోరాటం చేశారో ఆ నేత , మరో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు.
రామసుబ్బారెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి జమ్మలమడుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో ఆధిపత్య పోరు స్టార్ట్ అయ్యింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న తన అనుచరగణానికి న్యాయం జరిగేందుకు సుధీర్‌రెడ్డికి చాపకింద నీరులా ఎర్త్ పెడుతూ వస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను జూనియర్ అయిన సుధీర్‌రెడ్డి కూడా బలంగానే ఎదుర్కొంటూ వచ్చారు. చివరకు రామసుబ్బారెడ్డి వర్గం వచ్చే ఎన్నికల్లో సుధీర్‌రెడ్డికి సీటు లేదని… జమ్మలమడుగు సీటు తమ నేతదే అని గట్టిగా ప్రచారం చేసుకునే వరకు వెళ్లింది. దీంతో సుధీర్‌రెడ్డి పదే పదే జగన్‌కు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు రామసుబ్బారెడ్డికి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ బ్రేకులు వేసేశారు.
సుధీర్‌రెడ్డి పూర్తిగా నట్లు బిగించేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిన రామసుబ్బారెడ్డి చివరకు జగన్‌ను కలవక తప్పలేదు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి తాడేపేడో తేల్చుకునేలా ఆయన తాడేపల్లికి వెళ్లినా అక్కడ జగన్ ఆయనకే షాక్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వనని చెప్పిన జగన్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పనిచేసుకోవాలని చెప్పేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తామన్నారని ఆయన వర్గం చెప్పుకుంటున్నా… దానిపై కూడా గ్యారెంటీ ఇవ్వలేదంటున్నారు. 2023 వరకు కూడా ఆయన్ను ఏ పదవి అడగవద్దని చెప్పేశారట. రామసుబ్బారెడ్డి టీడీపీలో వరుస ఓటములతో ఉండడంతో ఆయన్ను ఆర్థికంగా ఆదుకునేందుకు కొన్ని కాంట్రాక్టులు ఇవ్వాలనుకున్నా దానిని కూడా సుధీర్ రెడ్డి అడ్డుకున్నారని టాక్ ?
ఇటు టీడీపీలో ఎన్ని సార్లు టిక్కెట్లు ఇచ్చినా, ఎమ్మెల్సీ పదవి ఉన్నా అవన్నీ వదులుకుని వైసీపీలో చేరినా ఏం ప్రయోజనం లేదని రామసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే చెరో సీటు ఇస్తామని.. లేకపోతే రామసుబ్బారెడ్డికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పంచాయితీ క్లోజ్ అయినట్టు చెప్పేశారు. అయితే ఈ పరిస్థితుల్లో రామసుబ్బారెడ్డి వైసీపీలో ఇమిడే పరిస్థితి లేకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల వరకు వేచి చూసి ఆ తర్వాత మళ్లీ పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.