విజయమ్మ లేఖపై ఏబీఎన్ ఆర్కే సంచలన వ్యాఖ్యలు !

ఎవరేం అనుకుంటారో అనవసరం. మీడియా అధినేతగా కంటే కూడా.. ఒక రాజకీయ విశ్లేషకుడిగా.. సీనియర్ పాత్రికేయుడిగా ప్రతి వారం ఠంచన్ తప్పకుండా కాలమ్ రాసే మీడియా యజమానుల్లో ఆంధ్రజ్యోతి ఆర్కే ఒక్కరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పాలి. ఒక ప్రముఖ మీడియా సంస్థకు బాద్యతలు నిర్వర్తిస్తూ.. తనకు తాను చేతిరాతతో కాలమ్ రాసే ఆర్కే.. ఎప్పటికప్పుడు సంచలన అంశాల్నిప్రస్తావిస్తుంటారు. అంతేకాదు.. లోతైన విశ్లేషణతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.

ఈ కారణంతోనే.. ఆర్కే రాసిన కొత్త పలుకును ఆయన్ను అభిమానించే వారు మాత్రమే కాదు.. ఆయన్నువిపరీతంగా వ్యతిరేకించే వారు సైతం క్రమం తప్పకుండా ఆయన రాసిన రాతల్ని చదివటం కనిపిస్తుంది. తాజాగా రాసిన కాలమ్ లో ఆయన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. అన్నింటికి మించి.. గత వారం తాను రాసిన ఆర్టికల్ లో.. వైఎస్ సోదరుడు వైఎస్ వివేక హత్యపై ఆయన కుమార్తె సునీత పెట్టిన ప్రెస్ మీట్ పై చేసిన విశ్లేషణపై విజయమ్మ రాసిన బహిరంగ లేఖను ఆయన ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఆయన బోలెడన్ని అనుమానాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో తన వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చదివితే..

  • సొంతింట్లోనే దారుణ హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఉంటుందని గత వారం నేను రాసిన ‘కొత్త పలుకు’కు సమాధానం చెప్పవలసింది పోయి.. శ్రీమతి విజయలక్ష్మి పేరిట ఒక లేఖ విడుదల చేయించి యథావిధిగా నాకు దురుద్దేశాలు ఆపాదించారు.
  • హత్యకు గురైన వ్యక్తి ముఖ్యమంత్రి సొంత బాబాయి. ఆరోపణలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సోదరి. ఇది వారి కుటుంబ వ్యవహారం ఎంత మాత్రం కాబోదు. ఎవరైనా పత్రికలలో వచ్చిన వార్తలకు లేదా వ్యాసాలకు అదే రోజు స్పందిస్తారు. ‘కొత్త పలుకు’కు సమాధానంగా విజయలక్ష్మి పేరిట రాసిన లేఖను మాత్రం ఒక రోజు ఆలస్యంగా మరుసటి రోజు విడుదల చేశారు.
  • వైఎస్‌ విజయా రాజశేఖర్‌ రెడ్డి పేరిట విడుదల చేసిన లేఖపై ఆమె సంతకం కూడా లేదు. శ్రీమతి విజయలక్ష్మి తనకు తాను వైఎస్‌ విజయా రాజశేఖర రెడ్డిగా గతంలో ఎప్పుడూ చెప్పుకోలేదు. విజయమ్మగా మాత్రమే అందరూ పిలుస్తారు. ఆమె కూడా విజయమ్మ అని మాత్రమే సంతకం చేస్తారు. దీన్నిబట్టి ఆ లేఖను ఎవరు రూపొందించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
  • గతంలో అన్న జగన్మోహన్‌ రెడ్డితో చెల్లి షర్మిలకు విభేదాలు ఏర్పడ్డాయని నేను రాసినప్పుడు కూడా షర్మిలపై ఒత్తిడి తెచ్చి మరో వివరణ ఇప్పించారు. ఆ తర్వాత షర్మిల అలా చేయడానికి కూడా నిరాకరించారు. తెలంగాణలో షర్మిల ప్రారంభించనున్న రాజకీయ పార్టీకి విజయలక్ష్మి మద్దతు ఉంటుందని నేను చెప్పినట్టుగానే శుక్రవారంనాడు ఖమ్మంలో జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు.
  • షర్మిల తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి ఎక్కడా జగన్మోహన్‌ రెడ్డి పేరు ఎత్తకపోవడమే కాకుండా పోస్టర్లు, ఫ్లెక్సీలలో అన్న ఫొటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్నిబట్టి అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది కదా! గతంలో నేనే కాదు, ఇతర మీడియా కూడా రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వార్తలు ప్రచురించలేదు. ఇప్పుడే అలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? వాటికి ఎవరు కారకులో విజయలక్ష్మి చెప్పాలి.