ష‌ర్మిల‌కు.. తెలంగాణ ప్ర‌జ‌లు కాదు.. తెలంగాణ ప్ర‌శ్న‌ల స్వాగ‌తం!

తెలంగాణ గ‌డ్డ‌పై రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. పార్టీ పెట్ట‌నున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌కు అనేక ప్ర‌శ్న‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏపీ పుట్టి నిల్లు.. తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొని రాజ‌కీయ అరంగేట్రం చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ప్పటికీ.. తెలంగాణ ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకోవ‌డం అంత ఈజీ కాద‌నే విష‌యం ష‌ర్మిల గ్ర‌హించాల‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ముఖ్యంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, పోలవరం ముంపు మండలాలు, ఐదు పంచాయతీల విలీనం వంటి ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఈ స‌భ ద్వారా స‌మాధానం చెప్పాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే.. ఇవి.. ఏపీకి సంబంధించిన కీల‌క అంశాలు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎటు స్పందించినా.. ష‌ర్మిల ఇరుకున ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన మ‌రో ప్ర‌శ్న కూడా ష‌ర్మిల‌ను వెంటాడుతోంది. ప్ర‌స్తుతం రాజ‌కీయ అరంగేట్రం చేసిన ష‌ర్మిల‌పై అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి.

రాష్ట్రంలో ఇత‌ర ప్ర‌తిప‌క్షాల దూకుడును త‌గ్గించేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్‌, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ష‌ర్మిల‌ను రాజ‌కీయంగా సంధించార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌ల‌కు కూడా స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

ఇక‌, మ‌రో కీలక అంశం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గ‌తంలో వైఎస్ అడ్డుప‌డ్డార‌నే వ్యాఖ్య‌లు ఉన్నాయి. 2009 ఎన్నిక‌ల‌స‌మ‌యంలో తెలంగాణ ఏర్ప‌డితే.. పాస్ పోర్టు తీసుకుని ఆ రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంటుందంటూ.. వైఎస్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ.. తెలంగాణ వేదిక‌ల‌పై వినిపిస్తూనే ఉన్నాయి.

మ‌రి దీనికి స‌మాధానం ఏంట‌నేది ఇప్పుడు ష‌ర్మిల తేల్చాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, కేంద్రం నుంచి తెలంగాణ కు రావాల్సిన విభ‌జ‌న హామీలు.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ఎలా సాధిస్తారు? అనే విష‌యాన్ని కూడా ఆమె ఈ సంక‌ల్ప స‌భ ద్వారా స్ప‌ష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)