తిరుపతి నేతల విషయంలో జగన్ పరేషాన్ అవుతున్నారా ? తాను వేసుకున్న అంచనాల మేరకు నేతలు పనిచేయడం లేదని.. స్పష్టమైందా ? లేక.. ఇప్పుడు పెరిగిన తిరుపతి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి సెగ తగలడం ఖాయమని నిర్ణయానికి వచ్చారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి బాగానే ఉంది. దీనికి ప్రధాన కారణం.. టీడీపీ ఒకవైపు.. బీజేపీ మరో వైపు.. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని పెంచుకోవడమే. అదే సమయంలో గతంలో జగన్ తిరుపతిపై చేసిన కామెంట్లను టీడీపీ నేతలు వీడియోల రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దీంతో ఇప్పటి వరకు వైసీపీకి ఉన్న ఎడ్జ్ అంతో ఇంతో కరగడం మొదలైంది.
మరో పది రోజులు ఎన్నికలకు సమయం ఉండడం.. టీడీపీ, బీజేపీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ విజయం దక్కించుకున్నా.. తాము అనుకున్న అంచనాలు సాధించడం.. దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా పరిస్థితిని తీసుకురావడం వంటివి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరి దీనికి కారణాలు ఏంటి? అంటే.. మొత్తం ఈ తిరుపతి పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వీటిలో మూడు చోట్ల వైసీపీ శ్రేణులు ముందుకు కదలడం లేదు. వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడు తక్కువగా ఉంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారా యణ రెడ్డి అలిగి మౌనం పాటిస్తున్నారు.
గూడూరులో వైసీపీ నేతలు అంతర్గత కలహాలతో పార్టీని బద్నాం చేస్తున్నారు. ఇక, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదనరెడ్డి దూకుడు ఉన్నా.. ఆయనతో కలిసి రాకుండా కొందరు నేతలు దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలకు తోడు.. వెంకటగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ.. దూకుడు పెంచారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రంగంలోకి దిగారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓటింగ్ ఈ దఫా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదేసమయంలో పార్టీ శ్రేణులు సైతం.. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సీబీఎన్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రచారం దంచికొడుతోంది.
ఆయా పరిణామాలను విశ్లేషిస్తున్న జగన్.. తన పార్టీ నేతలు ఆశించిన విధంగా దూకుడు ప్రదర్శించడం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్‌కు బాధ్యతలు అప్పగించడం.. కొందరికి నచ్చడం లేదు. దీంతో వారు కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్ అంతర్మథనం చెందుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. దీనికి పరిష్కారంగా తనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.