తెలుగుదేశంపార్టీలో కూడా కాంగ్రెస్ లాంటి పూర్తి ప్రజాస్వామ్యం లక్షణాలు వచ్చేసినట్లుంది. కాంగ్రెస్ లో అంటే పై స్ధాయిలో ఒకటి చెబితే ఇష్టముంటే పాటిస్తారు లేకపోతే తమిష్టం వచ్చింది చేసుకుపోతారు. కాంగ్రెస్ లో అంటే ఏమి చేసినా చెల్లిపోతుంది. ఎందుకంటే అది జాతీయపార్టీ కాబట్టి. కానీ ప్రైవేటు ప్రాపర్టీ లాంటి ప్రాంతీయపార్టీ టీడీపీలో కూడా అలాంటి లక్షణాలు బాగా వచ్చేసినట్లు అర్ధమవుతోంది. అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలను, ప్రకటనలను కొందరు సీనియర్లు దిక్కరిస్తున్నారంటే ఏమనుకోవాలి.
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ ప్రకటనను తాము పట్టించుకునేది లేదని కొందరు సీనియర్ నేతలు తెగేసి మరీ చెప్పేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతోనే కిందిస్ధాయి నేతలు, కార్యకర్తలున్నారు కాబట్టి వాళ్ళిష్ట ప్రకారమే ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు సీనియర్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. దీంతోనే అర్ధమైపోతోంది చంద్రబాబు ఆదేశాలకు కాలం చెల్లించదని.
ఆముదాలవలస, విజయనగరం, నర్సీపట్నం, పెందుర్తి, ఆళ్ళగడ్డ, హిందుపురం, అనంతపురం, జగ్గంపేట, నెల్లూరు, కుప్పం, చంద్రగిరితో పాటు అనేక నియోజకవర్గాల్లోని సీనియర్లు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో తమ మద్దతుదారుల కోసం ప్రచారంలోకి దిగేశారు. ఒకవైపు అభ్యర్ధులు సొంతంగా ప్రచారం చేసుకుంటుంటే మరోవైపు సీనియర్లు వీరికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు ఆదేశాలను పాటించాల్సిందే అని రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్నా ఎవరు పట్టించుకోవటంలేదు. శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు మావగారు, మాజీమంత్రి మంత్రి బండారు సత్యనారాయణమూర్తే తన మద్దతుదారులకోసం ప్రచారం చేస్తున్నారు. అంటే అచ్చెన్నకు బండారు వియ్యంకుడవుతారు. వియ్యంకుడినే కంట్రోల్ చేయలేకపోయినా అచ్చెన్న ఇతర నేతలను ఏమి కంట్రోల్ చేస్తారు.
మొత్తం మీద పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం టీడీపీలో కూడా పెరిగిపోయిన విషయం అర్ధమైపోతోంది. అందుకనే చంద్రబాబు ఆదేశాలనే సీనియర్లు పట్టించుకోవటంలేదు. విచిత్రమేమిటంటే చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఎవరు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ చెప్పారు. చెప్పిన కాసేపటికే తన భార్య తరపున ఎంపిటిసీ స్ధానంలో ప్రచారం చేశారు.