జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి జరిగిన రోడ్డుషో, తర్వాత బహిరంగసభ చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. తిరుపతి లోక్ సభలో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తన గెలుపు విషయంలో పవన్ పై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అయితే తాజా పరిణామాల తర్వాత అలాంటి ఆశలు ఫలించేట్లు కనబడటంలేదు. ఎందుకంటే పవన్ పాల్గొన్న రోడ్డుషో అయినా తర్వాత జరిగిన బహిరంగసభ అయినా చాలా పేలవంగా జరిగింది.
పవన్ రోడ్డుషో లోకానీ తర్వాత జరిగిన బహిరంగసభలో కానీ అంతా కనబడిందేమిటంటే ఒకే ఒక అంశం. అదేమిటంటే పవన్ను ఉద్దేశించి అభిమానులు సీఎం..సీఎం అని అరవటం. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో కూడా అభిమానులు ఇదే విధంగా పవన్ సమావేశాల్లో నానా గోలచేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో తాను అధికారంలోకి వచ్చేసినట్లే అని పవన్ భ్రమల్లో పడిపోయారు.
అయితే తర్వాత జరిగిన ఫలితాల్లో ఏమి తేలిందో అందరు చూసిందే. దాంతో అభిమానులపై పవన్ మండిపడ్డారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ తన బహిరంగసభలకు, రోడ్డుషోలకు వచ్చిన అభిమానులు కూడా తనకు ఓట్లేయలేదంటు నిష్టూరాలాడారు. ఓట్లేయని అభిమానులు తనను సీఎం..సీఎం అని అరిచినంత మాత్రాన ఏమిటి ఉపయోగం ? అంటూ నిలదీశారు. తన రోడ్డుషోల్లో, బహిరంగసభలో పాల్గొన్న అభిమానులు ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారా ? అంటూ మండిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుషో, బహిరంగసభలో కూడా జరిగిందిదే. ఇదే సమయంలో బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ప్రసంగం పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. ప్రశాంతంగా మాట్లాడిన పవన్ మధ్యలో మధ్యలో ఊరికే ఆవేశం తెచ్చుకుని ఊగిపోయి మాట్లాడారు. నిజానికి ఆవేశంలో మాట్లాడినపుడు పవన్ ఏమి మాట్లాడింది కూడా జనాలకు అర్ధంకాలేదు. మొత్తానికి తమను ఎన్నికల్లో గట్టెక్కిస్తాడని పవన్ మీద బీజేపీ పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు కనబడటంలేదు.