మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. అత్యవసర పరిస్థితుల్లో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో చేరడం ఉత్కంఠ రేపుతోంది. ఆయన ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. 87 ఏళ్ల మన్మోహన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఎయిమ్స్‌లో, అది కూడా రాత్రి 9 గంటల ప్రాంతంలో చేరడంతో మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కార్డియో-థోరాటిక్ వార్డులో మన్మోహన్‌కు చికిత్ అందుతోంది. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్.. మన్మోహన్‌ను పర్యవేక్షిస్తున్నారు. మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు వివరాలు వెల్లడించలేదు. ఆయన ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నట్లు మాత్రమే ప్రకటించాయి.
2004-14 మధ్య రెండు పర్యాయాలు, పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హాయంలో మన్మోహన్ ప్రధానిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత మన్మోహన్ రాజకీయాల్లో అంత చురుగ్గా ఏమీ లేరు. 2019 ఎన్నికల్లో అయితే ఆయన అసలు కనిపించనే లేదు.
గత ఏడాది కాలంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో మన్మోహన్ కొన్ని వ్యాఖ్యలు, విశ్లేషణలు చేశారు. అంతకుమించి ఆయన బయటికి వచ్చి విలేకరులతో మాట్లాడటం, రాజకీయ వ్యవహారాలపై స్పందించడం జరగలేదు. 90వ దశకంలో పీవీ నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేశారు మన్మోహన్.
దేశాన్ని పురోగతి వైపు నడిపించిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ పాత్ర కీలకం. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు అనూహ్య పరిణామాల మధ్య ఆయన ప్రధాని పదవి చేపట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates