రాజకీయాల్లో ఎప్పుడు ఎలా స్పందించాలో తెలిస్తే.. చాలు.. విజయం దానంతట అదే చేరువ అవుతుందని అంటారు సీనియర్లు. ఇప్పుడు ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఆయన గడప దాటకుండానే ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, కొన్ని రోజుల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల కిందట జరిగిన ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావించిన కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల సమయంలో కానీ.. జగన్ బయటకు రాలేదు. అంతా తాడేపల్లిలోని సీఎంవో నుంచే మంత్రాంగం నడిపించారు.
ఆయా ఎన్నికలకు ముందు జగన్ చేసిన ప్రకటనలు సంజీవని గా పనిచేసి.. పార్టీని గెలిపించాయనేది నిర్వివాదాంశం. పంచాయతీ ఎన్నికలకు ముందు.. ఏకగ్రీవాలపై సంచలన ప్రకటన చేశారు. ఏకగ్రీవాలు అయ్యేవాటికి ప్రోత్సాహకాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. ఇక, స్థానిక ఎన్నికల సమయంలోను, కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ మహిళా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. వారికి సెలవులు పెంచారు. అదేవిధంగా వారు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించారు. చాపకింద నీరు మాదిరిగా జగన్ చేసిన ఈ ప్రకటన భారీ ఎత్తున వర్కవుట్ అయిందని టీడీపీలోనే చర్చ సాగింది.
ఇక, ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గం పరిధిలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ యువతను ఆకర్షించేందుకు జగన్ ఇదే విదమైన పాచికను ప్లే చేశారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు అంటే.. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఏప్రిల్ 13 న జరగనున్న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో యువతకు ఉద్దేశించి ఉద్యోగ ప్రకటన వెలువరించాలని జగన్ ఆదేశించారు. దీనిపై అధికారులు, మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా జగన్ మరో పాచిక వేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేక దివాలా తీసే పరిస్థితి ఉందని ఒకవైపు ఆర్థిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వం, పలు నివేదికలు స్పష్టం చేస్తున్నా… తన ప్రభుత్వం పేదల పక్షానే ఉందని, ప్రజల పక్షానే ఉందని చెప్పుకొంటూ… సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12,039 మంది లబ్ధిదారులకు రూ.254 కొట్లను తాజాగా ఆయన విడుదల చేశారు. నిజానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో .. ఇంత మొత్తం అంటే.. వేరే వేరే ప్రాజెక్టులకు కేటాయిస్తే… అవిపూర్తవుతాయి. కానీ, ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే.. ఈ మాత్రం త్యాగం చేయాలని అనుకున్నారో… ఏమో.. ఒక్క బటన్ క్లిక్‌తో రూ.254 కోట్లను పంచేశారు. మొత్తానికి ఎన్నికల్లో బయటకు రాకుండానే జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు.. ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు..
Gulte Telugu Telugu Political and Movie News Updates